జగిత్యాల, జూన్ 6(నమస్తే తెలంగాణ): పొరుగు రాష్ట్రానికి చెందిన సీఎం వద్ద 30నెలలుగా అపాయింట్మెంట్ పొందలేని రేవంత్‌రెడ్డి ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. సాగునీటి వనరులను రాష్ట్ర ప్రజలకు అందించడంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గోదావరి, కృష్ణా జలాలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారని గుర్తుచేశారు.
తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో కేసీఆర్ లౌక్యంగా రాష్ర్టానికి మేలు చేసేందుకు ప్రాణహిత జలాలను ఒడిసిపట్టేందుకు 148 మీటర్ల ఎత్తువద్ద తమ్మిడిహట్టి నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. అలాగే కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, మానేరు త్రివేణి సంగమంగా ఉండటం, 300 టీఎంసీల నీరు లభ్యత ఉండటంతో గోదావరి జలాలపై హక్కుల సాధన కోసం కాళేశ్వరానికి 100 మీటర్ల దిగువన మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును నిర్మించారని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పూర్తి చేశారని పేర్కొన్నారు.
జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో గుర్తింపు పొందిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిపోతే 30నెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ కక్షతోనే వాటి మరమ్మతులు చేయించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరమ్మతులు కాదు కదా, కనీసం కుంగిన పిల్లర్ల వద్ద నేషనల్ డ్యామ్ స్టేఫీ అథారిటీ సలహా ప్రకారం డ్రిల్లింగ్ టెస్ట్ నిర్వహించలేకపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో తమ్మిడిహట్టి వద్ద బరాజ్ కడుతామని హామీ ఇచ్చిందని, ఇంత వరకు ఒక్క అ డుగు ముందుకు పడలేదని ఫైరయ్యారు.
విదేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం అన్నట్టుగా దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలకు బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మధ్యవర్తిత్వం చేయాలని సీ ఎం అనడం చూస్తే ఆశ్చర్యం కలుగుతు న్నదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ధోరణి చూస్తే తెలంగాణకు గోదావరి జలాలను ఎండబెట్టి, పోలవరానికి పంపించి చంద్రబాబు మెప్పు పొందే ప్రయత్నమే కనిపిస్తున్నదని ఆరోపించారు. రాష్ర్టానికి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారా..? ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం మరమ్మతులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తుందో అనే భ యంతోనే రేవంత్‌రెడ్డి మరమ్మతులు చేయించడం లేదని ఆరోపించారు. రేవం త్‌కు దమ్ముం టే తమ్మిడిహట్టి పూర్తి చేసి, కాళేశ్వరం మరమ్మతు లు చేయిస్తేనే ఓట్లు అడుగుతామని ప్రకటించాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తుతున్నారని, ఒకవేళ కరువు వస్తే రైతాంగానికి తీవ్ర వేదన మిగులుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. కాళేశ్వరం మరమ్మతులు, తమ్మిడిహట్టి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి ఉంటే తెలంగాణకు కరువు వచ్చినా ప్రమాదం ఉండేది కాదని పేర్కొన్నారు. కరువు వస్తే దానికి రేవంత్‌రెడ్డిదే పూర్తి బాధ్యత అవుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ సీఎం కావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్‌రావు, బీఆర్ఎస్ నాయకులు గాజుల రాజేందర్, దుర్గయ్య, రాజేందర్, శీలం ప్రవీణ్, దర రమేశ్‌బాబు, వెంకటేశ్వర్రావు, రాంమోహన్‌రావు పాల్గొన్నారు.