హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్2024కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రికార్డుస్థాయిలో 12.3లక్షల దరఖాస్తులొచ్చాయి. ఏటా ఈ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. జేఈఈ2023 జనవరి, ఏప్రిల్‌లో నిర్వహించిన రెండు సెషన్లతో పోల్చితే ఈసారి 68 వేలు అధికంగా దరఖాస్తులు నమోదయ్యాయి. రాష్ర్టాల వారీగా దరఖాస్తుల స్వీకరణలో మహారాష్ట్ర టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత ఏపీ, మూడో స్థానంలో తెలంగాణ ఉన్నది.
2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్ -1 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు మూడు రోజుల ముందు అడ్మిట్‌కార్డులు విడుదల చేస్తారు. ఫిబ్రవరి 12న మొదటి సెషన్ ఫలితాలను వెల్లడిస్తారు. జేఈఈ మెయిన్‌ను ఇంగ్లిష్ సహా 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ మీడియంలో హాజరయ్యేందుకు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఆ తర్వాత 40వేల మంది విద్యార్థులు హిందీ మీడియంలో, 16,731 మంది విద్యార్థులు గుజరాతీ మీడియంలో పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకొన్నారు.