హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): ఐఐటీల్లో చదవాలన్న ఆసక్తి రానురాను అధికమవుతున్నది. ఇందుకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు వస్తున్న దరఖాస్తులే నిదర్శనం. ఈ ఏడాది అత్యధికంగా 1.91లక్షల దరఖాస్తులొచ్చాయి. నిరుడు 1.89 లక్షల దరఖాస్తులు రాగా, ఈ ఏడాది రెండువేలు అధికంగా దరఖాస్తు చేయడం విశేషం. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను ఈ నెల 26న నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 :30 గంటల వరకు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో సుమారు 17,385 సీట్లున్నాయి. వీటిల్లో 20 శాతం సీట్లను సూపర్‌న్యూమరరీ కోటాలో అమ్మాయిలకు రిజర్వు చేస్తారు. ఐఐటీల్లో చేరుతున్న వారిలో 65 శాతం అబ్బాయిలుండగా, కేవలం 35 శాతం అమ్మాయిలుంటున్నారు. ఐఐటీల్లో లభిస్తున్న ప్లేస్‌మెంట్స్, వేతన ప్యాకేజీలతో విద్యార్థులు ఐఐటీల పట్ల ఆసక్తిచూపుతున్నారు.
జేఈఈ మెయిన్‌లో క్వాలిఫై అయనవారంతా జేఈఈ అడ్వాన్స్‌కు దరఖాస్తు చేయడం లేదు. తాజా గణాంకాలను పరిశీలిస్తే ఇదే అవగతమవుతున్నది. విద్యార్థుల్లో కొంత మంది జేఈఈ మెయిన్ వరకే పరిమితమవుతున్నారు. ఏటా జేఈఈ మెయిన్‌కు 14లక్షల మంది హాజరవుతున్నారు. వీరిలో నుంచి 2.5లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు క్వాలిఫై అవుతున్నారు. కానీ దరఖాస్తులు అంతగా రావడంలేదు. ఏటా 90 వేల నుంచి 60 వేల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను సీరియస్‌గా తీసుకోవడంలేదు. 2022లో ఏకంగా 90వేల మంది అడ్వాన్స్‌డ్‌ను వదులుకోగా, నిరుడు 61వేల మంది, ఈ ఏడాది 59వేల మంది అడ్వాన్స్డ్ వైపే చూడలేదు. వీరు అసలు దరఖాస్తు కూడా చేయకపోవడం గమనార్హం. కొంత మంది 12వ తరగతిలో 75శాతం మార్కుల నిబంధన కారణంగా కొంత మంది వదులుకుంటుండగా, మరికొంత మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కఠినంగా ఉండటంతో తమ వల్లకాదని వదిలేస్తున్నారు. మరికొంత మంది ఎన్ఐటీల్లో సీట్లు వస్తే చాలని అంత వరకే పరిమితమవుతున్నారు.

3