Telangana | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితులు దాపురించాయని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన ఏమాత్రం బాగాలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. అవినీతి పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగులు, రాజకీయనాయకులేనని స్పష్టంచేశారు. తాము ఓటేసిన నాయకుల వద్దకు సమస్యలు పరిష్కరించాలని పోతే కలవడం లేదని, వారి కోసం చెప్పులరిగేలా తిరగాల్సి వస్తున్నదని వాపోయారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ (వైఏసీ) సంస్థ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సర్వే రిపోర్టును సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బుధవారం విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన 14,3456 మంది 19 నుంచి 60 ఏండ్ల రైతులు, ఉద్యోగులు, మహిళలు, పురుషుల నుంచి అభిప్రాయాలు సేకరించి రిపోర్టును వైఏసీ ప్రచురించింది. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో అవినీతిపై అధికారులు, నాయకుల పనితీరుపై ఆ సంస్థ వలంటీర్లు ఆన్లైన్లో, ఆఫ్‌లైన్‌లో గ్రామం, పట్టణం, నగరంవారీగా అన్నివర్గాల ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలతో రిపోర్టు సిద్ధం చేసింది. ఈ సర్వేలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. రిపోర్టును ప్రభుత్వంతోపాటు ప్రతిపక్ష పార్టీలకు అందజేస్తామని వైఏసీ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి చెప్పారు. రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలన, సమాజంలో అవినీతి, రాజకీయ నాయకుల తీరు వంటి 13 ప్రశ్నలతో సర్వే నిర్వహించగా అధికశాతం ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిపారు.
అవినీతిరహిత సమాజం కావాలి
అవినీతిరహిత సమాజం కోసం, పారదర్శక పాలన కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. అన్నిరంగాల్లో అవినీతి పెచ్చరిల్లుతున్నదని, సంస్కరణల ద్వారా అవినీతిని పూర్తిగా నిర్మూలించవచ్చని సూచించారు. ఆన్లైన్ సేవలు, డిజిటల్ పేమెంట్లు అన్ని శాఖల్లో పూర్తిస్థాయిలో అమలుచేయాలని చెప్పారు. నిజాయితీతో పనిచేస్తానని ప్రతి కార్యాలయంలో ఉద్యోగి సీటు వెనుక సూక్తి రాయాలని గతేడాది ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. వైఏసీ సంస్థ పదేండ్లుగా సమాజంలో మార్పు కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా మార్చుకొని ప్రజలకు అనేక అంశాల్లో అవగాహన కల్పిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు కొన్నె దేవేందర్, కోమటి రమేశ్‌బాబు, గీతానంద్, ప్రదీప్‌రెడ్డి, బత్తిని రాజేశ్, కొక్కుల ప్రశాంత్, నాగేంద్ర, నరేశ్ పాల్గొన్నారు.
రాష్టంలో అవినీతి ఉన్నదా?
చాలా ఉన్నది: 76%
సాధారణంగా: 14%
లంచం ఇవ్వకపోతే పనులు కావడం లేదా?
కావడం లేదు: 47.9%
అధికార్లు ఇబ్బంది పెడుతున్నరు: 28.4%
లంచం ఎలా ఇస్తారు
డబ్బు రూపంలో: 63.7%
వస్తు రూపేణా: 34.2%
మీ ప్రాంతంలో నిజాయితీ అధికారులున్నారా
లేరు: 63%
ఉన్నారు: 20%
ఏసీబీ, సీబీఐ, ఈడీ వల్ల అవినీతి తగ్గుతుందా?
కొంచెం తగ్గుతది: 48.6%
ప్రయోజనం లేదు: 26%
అధికారులతో పనిచేయించుకోవడానికి ఏం వాడుతరు?
లంచం వాడుతం: 43%
న్యాయపోరాటం : 41%
అవినీతికి ప్రధాన కారణం ఎవరు?
ఉద్యోగులు, నాయకులు: 65%
అధికారులు లంచం ఎలా తీసుకుంటారు?
బ్రోకర్ల ద్వారా: 54.8%
డైరెక్టుగా : 30.8%
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు కనీస మర్యాద ఇస్తున్నారా?
పట్టించుకోరు : 64.4%
దురుసుగా ప్రవర్తిస్తారు: 16.4%
దళారీ వ్యవస్థతో అవినీతి పెరుగుతుందా?
పెరుగుతుంది : 47.9%
దళారులే ప్రధాన కారణం: 28.1%
తెలంగాణలో కొత్త ప్రభుత్వ తీరు ఎలా ఉన్నది?
ఫర్వాలేదు: 41.8%
బాగా లేదు: 25.3%
అధ్వాన్నం: 23.3%
మీరు ఓటేసిన నాయకులు మీ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లినప్పుడు కలుస్తారా?
వాళ్లకోసం తిరగాలి: 36.3%
ఎక్కడ ఉంటరో తెలియదు : 24%
అవినీతి నిర్మూలన కోసం మా సంస్థతో కలిసి పనిచేస్తారా?
కలిసి పనిచేస్తాం: 80.1%