Sunitha Laxma Reddy | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిపై రేవంత్ ప్రభుత్వం చేయించిన దమనకాండపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. సునీతాలక్ష్మారెడ్డి చీరను లాగడాన్ని తమిళనాడు మాజీ సీఎం, దివంగత ‘జయలలిత’ ఉదంతంతో కొందరు నెటిజన్లు పోలుస్తున్నారు. అది 1989వ సంవత్సరం. డీఎంకే నేత కరుణానిధి తమిళనాడు సీఎంగా ఉన్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత వ్యవహరిస్తున్నారు.
బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభలో డీఎంకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో డీఎంకే ఎమ్మెల్యేలు జయలలిత హెడ్ ఫోన్లు తీసుకొన్నారు. ఇదేసమయంలో దురై మురుగన్ అనే డీఎంకే సభ్యుడు జయలలిత చీరను లాగారు. మరో ఇద్దరు డీఎంకే ప్రతినిధులు ఆమె జుట్టును పట్టుకొని ఈడ్చిపారేశారు. సభలో తనకు జరిగిన అవమానంపై ఉద్వేగంతో మాట్లాడిన జయలలిత.. మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడుతానని శపథం చేశారు. ఆమె చెప్పినట్టే, 1991లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు చేపట్టి అసెంబ్లీలోకి ప్రవేశించారు.