Jani Master | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మహిళా డ్యాన్సర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రాజేంద్రనగర్ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 19న గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. శుక్రవారం ఆయనను ఉప్పర్‌పల్లిలోని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు.
అంతకుముందు ఆయనకు గోల్కొండ ఏరియా హాస్పిటల్లో వైద్యపరీక్షలు జరిపించారు. కాగా, ఈ కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు అంశాలను పొందుపరిచారు. నిందితుడు గత 4 ఏండ్ల నుంచి బాధితురాలిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని, 2020లో తొలిసారి ముంబైలో లైంగిక దాడికి పాల్పడినప్పుడు బాధితురాలి వయస్సు 16 సంవత్సరాలేనని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని, ఈ కేసులో జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించాడని తెలిపారు.