ఊట్కూర్, మార్చి 20: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో నారాయణ పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి (Narayanpet-Kodangal Lift) నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్.నర్సింహా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన ఈ ఎత్తిపోతలకు నిధులు ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు ఇస్తామని చెప్పి నిధులు కేటాయించకుండా ఎలా పూర్తి చేస్తారో సంబంధిత అధికారులు, మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నపుడు రాష్ట్ర బడ్జెట్లో అధిక శాతం నిధులు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసి సంవత్సరంలో పూర్తి చేసిన విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కొందరు నాయకులు అడ్డుపడడం మంచిది కాదని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించిన విషయాన్ని పార్టీ పెద్దలు గుర్తు పెట్టుకొని అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరించాలని హితవు పలికారు. నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ప్రతి బడ్జెట్ సమావేశంలో నిధులు కేటాయించి ప్రాజెక్టును నిర్ణీత గడువు లోపల పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.