బీసీ కులగణనను తప్పుదారి పట్టించేందుకే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని కృత్రిమంగా నడిపిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఢిల్లీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక రిజర్వేషన్లను రద్దు చేయాలని ఆందోళన చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వారు ముందుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేయాలని అన్నారు.
బీసీ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి బీసీల జనాభా లెక్కల ఆధారంగా వారికి రాజ్యాంగబద్ధమైన హక్కులు, రిజర్వేషన్లు దామాషా ప్రకారం కల్పించాలని బీసీలు పోరాడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీ కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకే రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు.
రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరుతున్న వారికి తాము కూడా ఒక సవాల్ చేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశ సంపద, సహజ వనరులపై ఆధిపత్యం కలిగిన కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, భూస్వాములు తదితరుల ఆస్తి హక్కులను రద్దు చేసి.. దేశ సంపదను జాతీయం చేసి, జనాభా దామాషా ప్రకారం సమానంగా పంపిణీ చేసిన తర్వాత రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు దాటినా దేశంలో సామాజిక అసమానతలు, ఆర్థిక దోపిడీ పూర్తిగా తొలగిపోలేదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొంతమంది సంపద రోజురోజుకూ పెరుగుతుంటే.. పేదలు, మధ్యతరగతి ప్రజలు, కులవృత్తులపై ఆధారపడిన వారు కనీస జీవన ప్రమాణాలతో జీవించలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 90 శాతం ప్రజలకు విద్య, ఉద్యోగం, ఉపాధి, ఆరోగ్యం వంటి కనీస అవకాశాలు అందడం లేదని పేర్కొన్నారు.
రిజర్వేషన్ వ్యతిరేకులు వాస్తవాలను గ్రహించి సామాజిక దోపిడీ, కుల వివక్ష, ఆర్థిక అసమానతలు లేని సమసమాజం కోసం పోరాడాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. దేశాన్ని అవినీతి, కార్పొరేట్ ఆధిపత్యం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు. సామాజిక రిజర్వేషన్లపై ఇదే విధంగా విషప్రచారం కొనసాగిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలన్నీ ఏకమై తగిన విధంగా స్పందిస్తాయని హెచ్చరించారు.