చిక్కడపల్లి, డిసెంబర్ 28 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కొంతమంది కుట్రలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పష్టతనివ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం దోమలగూడలోని బీసీ భవన్లో బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి వరకు జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పేర్లను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినప్పటికీ అది పూర్తిస్థాయిలో జరుగలేదని, పట్టణ ప్రాంతాలు, హైదరాబాద్ నగరంలో చాలామంది సర్వే కోసం తమ ఇండ్లకు ప్రభుత్వ ఎన్యూమరేటర్లు రాలేదని పేర్కొన్నట్టు శ్రీనివాస్‌గౌడ్ ఈ సందర్భంగా తెలిపారు. అధికారులు మాత్రం 98% సర్వే జరిగిందని తప్పుడు లెక్కలు చెబుతున్నారని, ఇది నమ్మి సీఎం రేవంత్‌రెడ్డి సైతం 98% పూర్తయ్యిందని ప్రకటించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంచేశారు. రాష్ట్రంలో 100% సర్వేకు సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో బీసీ కులసంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, కన్వీనర్ బాలగోని బాలరాజుగౌడ్, వైస్ చైర్మన్ దీటి మల్లయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌ముదిరాజ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బీ మణిమంజరీసాగర్, నాయకులు జాజుల లింగంగౌడ్, మల్లికార్జున్నాయక్, శ్యామల, సంధ్యారాణి, వియజలక్ష్మి, విజయ్‌కుమార్‌గౌడ్, శంకరాచారి, గౌతమి పాల్గొన్నారు.