ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ వైఖరికి నిరసనగా విద్యార్థులు (Gurukula Students) ఆందోళన బాట పట్టారు. ప్రిన్సిపల్ సంగీతను తొలగించాలంటూ ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, నాసిరకం భోజనంపై ప్రశ్నించినందుకు తమను వేధిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆమెను తొలగించేవరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.
గురువారం ఉదయం మావలలో ఉన్న గురుకుల క్యాంపస్ నుంచి 46 మంది విద్యార్థులు ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పాఠశాల గేటు దూకి తమ సమస్యను తెలియజేయడానికి పోలీస్ స్టేషన్కు 4 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చామన్నారు. వారి సమస్యలు విన్న పోలీసులు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కలెక్టర్ రాజర్షి షా.. ఆర్డీవో వినోద్ కుమార్ను పాఠశాలకు పంపించి విచారణ జరిపి తగు నివేదిక ఇవ్వాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు విద్యార్థులకు నచ్చజెప్పి పాఠశాలకు తిరిగి పంపించారు.