రైతు బాంధవుడైన కేసీఆర్ అంటే రైతులకు ఎనలేని అభిమానం. సూర్యాపేట జిల్లా నూతనకల్కు చెందిన యువరైతు బండి అనిల్.. యాసంగికి సిద్ధం చేసిన నారుమడిలో ‘జై కేసీఆర్’ ఆంగ్ల అక్షర ఆకృతిలో వడ్లు చల్లగా, పచ్చని నారు పెరిగింది. అది చూసి మురిసిపోయిన అనిల్ శనివారం ‘జై కేసీఆర్’ నారుతో సెల్ఫీ దిగాడు.
-నూతనకల్
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఖమ్మంలో టీకప్పులు పట్టుకొని శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
– ఖమ్మం ఎడ్యుకేషన్
బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో తరగతులు సక్రమంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, జూలూరుపాడు, చండ్రుగొండ కేజీబీవీల ఎదుట ఎస్ఎఫ్ఐ,
ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థినులు శనివారం ధర్నా నిర్వహించారు.
– రఘునాథపాలెం/జూలూరుపాడు/చండ్రుగొండ
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు (సీఆర్టీ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. వీరికి టీపీటీఎఫ్ నేతలు సంఘీభావం ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని సీఆర్టీలు మండిపడ్డారు.
-భద్రాచలం
తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ఆందోళన చేపట్టారు. శనివారం కామారెడ్డిలో సీఐటీయూ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి, ఇప్పుడు పరీక్ష రాయాలనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
– కామారెడ్డి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను రైతులు ప్రశ్నించారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా బల్మూరులోని ఆంజనేయస్వామి ఆలయం ఎదుట వంద మంది రైతులు ఆందోళన చేపట్టారు. ‘కృష్ణా నీరు వద్దు.. మా భూములే ముద్దు ’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికలప్పుడు ప్రాజెక్టు నిర్మించకుండా చూస్తానని చెప్పిన ఎమ్మెల్యే నేడు రైతులను తొక్కుకుంటూ వెళ్లి ప్రాజెక్టు నిర్మిస్తానని అనడం ఎంత వరకు సమంజసమని ధ్వజమెత్తారు.
-బల్మూర్