పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. జగిత్యాలలో తమదే అసలైన కాంగ్రెస్ కుటుంబం అని ఆయన స్పష్టం చేశారు. ఇదే జీవన్ రెడ్డి ఎన్టీఆర్ మంత్రి వర్గం నుంచి బయటకు వచ్చేసి నాదెండ్ల భాస్కర్‌రావు మంత్రివర్గంలో చేరి ఇంకో పార్టీతో కలవలేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌లో తనకు అవకాశాలు రాకపోవడంతోనే బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాల్సి వచ్చిందని సంజయ్‌కుమార్ తెలిపారు. ఇప్పుడు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని పేర్కొన్నారు. దానికి జీవన్ రెడ్డి పదే పదే పార్టీ ఫిరాయింపులు అని మాట్లాడటం సమంజసం కాదని సూచించారు.
జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యలో తన అనుచరుల హస్తం ఉందని వస్తున్న ఆరోపణలపైనా సంజయ్‌కుమార్ స్పందించారు. తాము ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించమని తెలిపారు. హింసలు, హత్యలు ఎవరి ఇంట్లో జరిగాయో జగిత్యాల ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. గంగారెడ్డి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతున్నారని సంజయ్ కుమార్ అన్నారు. పార్టీ ఫిరాయింపులకు జీవన్ రెడ్డి పాల్గొన్నారని అన్నారు. తాను ఇంకా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని పేర్కొన్నారు.
జీవన్ రెడ్డి ఏమన్నారంటే..
ఫిరాయింపుల కారణంగా బీఆర్ఎస్ ఎవరో.. కాంగ్రెస్ ఎవరో అర్థం కావడం లేదని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెస్ నేతలు కూడా తాము కాంగ్రెస్సే అని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. ఎంఐఎంను మినహాయించినా కాంగ్రెస్ సుస్థిరంగానే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలని చట్టంలోనూ ఉందని గుర్తుచేశారు. ఫిరాయింపులు మంచిది కాదని హైకమాండ్‌కు చెప్పానని పేర్కొన్నారు. ఇక దానిపై నిర్ణయం పార్టీ ఇష్టమేనని తెలిపారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మాత్రం మారదని స్పష్టం చేశారు.