జగిత్యాల అర్బన్, అక్టోబర్ 17: జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యపై వేటు పడింది. పురపాలక శాఖ రాష్ట్ర కమిషనర్‌కు సరెండర్ చేస్తూ కలెక్టర్ బీ సత్యప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సెక్రటేరియట్లో సాగునీటి పారుదల శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న సమ్మయ్యను ఏడాది కాలంపాటు జగిత్యాల మున్సిపల్ కమిషనర్‌గా డిప్యుటేషన్ పోస్టింగ్ ఇవ్వగా.. గత జూలై 3న జగిత్యాలలో బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి జిల్లా పరిపాలన యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదని ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ పాలకవర్గం నుంచి ఫిర్యాదులు అందాయి.
ఆగస్టు 15న పరేడ్ గ్రౌండ్లో జెండావిష్కరణ ఏర్పాట్ల కోసం మున్సిపల్ సిబ్బందిని, అధికారులను పంపకుండా అడ్డుపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన అర్జీలను పరిశీలించకుండా నిర్లక్ష్యం చేయడం, పలుమార్లు ఉన్నతాధికారులతో వాదనకు దిగేవారని పాలకవర్గం ఇచ్చిన ఫిర్యాదులను ఉత్తర్వుల్లో చూపుతూ సమ్మయ్యను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌కు సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టిన కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ 21న హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే ఆయన ప్రాజెక్టు ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు. సీడీవో, క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాల అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టుపై విచారణ చేపట్టి 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ఫిబ్రవరిలో నియమించింది. గడువు సైతం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కమిషన్ గడువును మరోసారి పొడిగించే అవకాశమున్నదని తెలుస్తున్నది. ఆ దిశగా ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి.