జగిత్యాల, మే 17 (నమస్తే తెలంగాణ): జగిత్యాల జైత్రయాత్ర నిర్మాతల్లో ఒకరైన పండుగ నారాయణ (75) కన్నుమూశారు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 15న తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1968లో పీయూసీ చదివిన నారాయణ కొంతకాలం ప్రైవేట్ స్కూల్ నడిపారు. ఆ తరువాత నక్సలైట్ల ఉద్యమంలో చేరారు. ఎమర్జెన్సీలో రహస్య జీవితం గడిపి, తర్వాత కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి రావడంతో బహిరంగ ప్రజాఉద్యమాల నిర్మాణం చేపట్టారు.
విద్యార్థులు, యువత, రైతుకూలీల్లో ఆయన రగిలించిన చైతన్యంతో వారంతా భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమించారు.జూలై 17న ఏర్పాటుచేసిన రైతుకూలీ సంఘం మహాసభ, జగిత్యాల జైత్రయాత్రగా ప్రసిద్ధి పొందింది. దీనివెనుక నారాయణ కీలకపాత్ర పోషించారు. జగిత్యాల జైత్రయాత్ర యాత్ర అనంతరం జగిత్యాల, సిరిసిల్ల తాలూకాలను నాటి ప్రభుత్వం కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది. అనేక కేసుల కారణంగా ఆయన జైలు జీవితం గడిపి 1984 ఫిబ్రవరిలో బయటకు వచ్చారు. అనంతరం హైదరాబాద్కు మకాం మార్చిన నారాయణ ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. కొన్నాళ్లకు స్వగ్రామం చేరుకొని అక్కడే స్థిరపడ్డారు.