జగిత్యాల టౌన్, మార్చి 30 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో కామాటిగా పనిచేస్తున్న శ్రీనివాస్ చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం రాత్రి సమయంలో పడుకున్న విద్యార్థులను శ్రీనివాస్ చీపురుతో చితకబాదినట్టున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాళ్ల ధర్మారం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన కామాటి శ్రీనివాస్ నిత్యం మద్యం మత్తులో డ్యూటీకి హాజరవుతున్నాడన్న విమర్శలు ఉన్నాయి.
హాస్టల్ వార్డెన్ మధుసూదన్ పలుమార్లు మందలించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిసింది. ఎస్సీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్ రాజ్‌కుమార్ పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యల కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సత్యప్రసాద్ .. కామాటి శ్రీనివాస్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మధుసూదన్ ఫిర్యాదు మేరకు విద్యార్థులను చీపురుతో కొట్టిన కామాటి శ్రీనివాస్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.
మద్దూర్, మార్చి 30 : నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మోమినాపూర్‌లో ఎంపీహెచ్ఎస్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో ఉపాధ్యాయుడు స్వామిని, పాఠశాలలో క్రమశిక్షణ లోపాలను పట్టించుకోకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు హెచ్ఎం చెన్నకేశవులు, మరో ఉపాధ్యాయుడు గుర్నాథ్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్టు డీఈవో గోవిందరాజులు తెలిపారు.