మహబూబ్‌నగర్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/లింగాల: నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు యువకుల మీద ఓ ఎస్సై జరిపిన దాష్టీకంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పెట్రోల్ బంక్‌లో గొడవ చేశారని ఆ యువకులతో మూడ్రోజులపాటు పోలీస్‌స్టేషన్‌లో వెట్టి చాకిరీ చేయించిన ఎస్సై.. ఆపై వారికి శిరోముండనం చేయించడంతో.. ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంగతి బయటకు పొక్కడంతో సిబ్బందిని కాపాడుకొనేందుకు ఎస్పీ రంగంలోకి దిగారు. ఆయన ఎస్సైని వెనుకేసుకొని రావడం, ఆత్మహత్యకు యత్నించిన యువకుడి తండ్రి.. తప్పు తన కుమారుడిదేనంటున్న వీడియో బయటకు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ యువకుడి తల్లి మాత్రం ఎస్సై గుండు గీయించినందుకే తన కుమారుడు బలవన్మరణానికి ప్రయత్నించాడని మీడియా ముందు కుండబద్దలు కొట్టింది. దీంతో ఎస్సైపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి.
లింగాలలో ఈ నెల 13న పెట్రోల్ బంక్‌కు బైక్‌పై వచ్చిన ముగ్గురు రూ.20 పెట్రోల్ కొట్టమని అడిగారు. అంతతక్కువకు పెట్రోలు పోయలేమని సిబ్బంది చెప్పడంతో యువకులు గొడవకు దిగారు. వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ మరుసటి రోజు ఉదయం ఎస్సై జగన్మోహన్ ఆ యువకులను స్టేషన్‌కు పిలిపించి మందలించాడు. ఇంతలో ఓ యువకుడు ఎస్సై ముందు తల దువ్వడంతో బండబూతులు తిట్టాడు. అంతేకాకుండా ఈ ముగ్గురికి గుండు గీయించాలని వారి తల్లిదండ్రులకు హుకుం జారీచేశాడు. ఆ తరువాత వారిని మూడు రోజులు స్టేషన్‌కు పిలిపించి స్టేషన్ పరిసరాలు శుభ్రం చేయించడం, బాత్రూమ్లు కడిగించడం చేయించారు. చివరి రోజు వారికి స్టేషన్లోనే గుండు గీయించారు.
‘పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై నాకు గుండు గీయిస్తుంటే మా నాన్న ఎందుకు అడ్డు చెప్పలేదు’.. అంటూ గోపిశెట్టి వినీత్ అనే బాధిత యువకుడు ప్రశ్నించాడు. లింగాలలో చాయ్ దుకాణం నడిపే వినీత్ తండ్రి సుధాకర్ తన కొడుకుకు పోలీసులు గుండు గీయించిన విషయం బయటకు చెప్పకుండా దాచి ఉంచాడు. దీంతో మనస్తాపం చెందిన వినీత్ శుక్రవారం ఉదయం ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ దవాఖానకు తరలించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
శిరోముండనంతోనే తన కొడుకు వినీత్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని తల్లి హేమలత మీడియాకు స్పష్టంచేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే తండ్రి సుధాకర్.. తాను తిట్టినందుకే వినీత్ ఆత్మహత్యకు ప్రయత్నించాడని చెప్తున్న వీడియో బయటకు వచ్చింది.
ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ వైభవ్ తమ సిబ్బందిని వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్సై సెలవులో ఉన్నాడంటూ ఆయనను మీడియా కంటపడకుండా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఐ రవీందర్.. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతుందని, నిజమని తేలితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం.