నల్లగొండ: కేసీఆర్ కాలి గోటికి కూడా సరితూగని వాళ్లు ఆయనపై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కాలం నుంచే కుట్రలు చేసిందని ఆయన ఆరోపించారు. నల్లగొండలో శనివారం జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల బాధలు తెలిసిన నేత కేసీఆర్ అని, అందుకే కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పారు. ధాన్యం, ఆహార ఉత్పత్తుల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని, తెలంగాణను తన కుటుంబంగా భావించి కష్టపడ్డారని అన్నారు.
ఇంకా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పాలకులకు ప్రజలపట్ల ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యం. అందుకు కేసీఆర్ నిదర్శనం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన పార్టీ బీఆరెస్. కాంగ్రెస్ ‘420’ హామీలు ఇచ్చింది. మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసి జుట్ల పంచాయతీ పెట్టారు. మిగతా హామీల గురుంచి అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బూతులు, ఎదురు దాడికి భయపడే వాళ్ళు ఎవరూ లేరు. వీళ్లు పదవుల కోసం హైకమాండ్‌కు బానిసలుగా మారారు. ఎన్ని రోజులు అబద్దం చెప్తారు..? కేసులు చాలా చూసి చూసి వచ్చాం. బయపడేది లేదు. కేసీఆర్ కాలి గోటికి సరిపోని వాళ్లు ఆయన మీద మాట్లాడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మేం కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టలేదు. గతంలో కేసులు పెట్టించిన కాంగ్రెస్ నేతలను ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టించారు. సాగర్ ఎడమ కాల్వ నీటిని తరలించుకుపోతుంటే పట్టించు కోలేదు.
కృష్ణ జలాలను తరలించుకుపోతుంటే హారతులు పట్టిన ద్రోహులు మీరు. హామీలు నెరవేర్చడం చేత కాక కేసీఆర్‌పై నెపం నెడుతున్నారు. మాతో పెట్టుకోవద్దు. నికార్సైన ఉద్యమకారులం మేం. నేను వ్యక్తిగత ఆరోపణలకు దిగితే రోడ్ల మీద తిరగలేవు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతరా..? మంత్రి పదవి ఇచ్చింది అందుకేనా..? ఇంత అహకారపూరిత మాటలు ఎందుకు..? రైతులకు డబ్బులు ఇవ్వలేనప్పుడు కాళ్ళు పట్టుకుని చెప్పుకోవాలి. బీఆరెస్ తెలంగాణ ప్రజల కోసం నిరంతరం నిలబడుతది. నల్లగొండ ప్రజల చైతన్యం ముందు మీ అహంకారం నిలబడదు. అధికారం అడ్డం పెట్టుకుని ఎదో చేయాలనుకుంటే ఇక్కడ సాగదు’ అని జగదీష్ రెడ్డి విమర్శించారు.
‘సూర్యాపేట నుంచి మళ్ళీ మొదలైంది. బీఆర్ఎస్ గెలుపు. పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలి. అందుకోసం కష్టపడాలి. కాంగ్రెస్ హామీలపై ప్రజల పక్షాన నిలబడాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఉద్యమంలో లాగా సింహాల్లా కదలాలి. రైతుబంధు పడట్లేదు. కరెంట్ పోతుంది. రైతుబంధుకు 15 వేలు అని మోసం చేస్తున్నరు. రెండు లక్షల రుణమాఫీ సోనియా పుట్టినరోజు నుంచి ఇస్తాం అన్నారు. మరి అది ఏ పుట్టినరోజో చెప్పలేదు. సాగర్ ఆయకట్టుకు కృష్ణా నీళ్లు ఇవ్వలేక పోయారు. ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు ఉన్నా ఇవ్వడం లేదు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. వారం పది రోజుల్లోనే కేసీఆర్ బయటకు వస్తారు. తొందరలోనే నల్లగొండ వస్తానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం’ అని మాజీ మంత్రి పిలుపునిచ్చారు.