సూర్యాపేట, జనవరి 21 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లాలో పోలీస్, కాంగ్రెస్ గూండాల రాజ్యం నడుస్తున్నదని, త్వరలోనే కాంగ్రెస్ పాపాల పుట్ట పగలడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోయి లేకుండా ఇచ్చిన ఆదేశాలతోనే మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేశారని ఆయన ధ్వజమెత్తారు. సూర్యాపేటలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాపం వెంకట్‌రెడ్డికి రోజుకో రకమైన ఫోబియా పట్టుకుంటుందని, ఆ మధ్యన రైతులు, ప్రజలను చూసి, ఇటీవల కేటీఆర్‌ను చూసి ఫోబియాతో వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. రెండు రోజులుగా కేటీఆర్ ఫొటోలు చూసినా, గులాబీ రంగు చూసినా తట్టుకునే పరిస్థితి లేకుండా భయపడి వణుకుడు పట్టుకుంటుందని చెప్పారు.
నల్లగొండకు కేటీఆర్ వస్తారని బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హుకూంతో మున్సిపల్ అధికారులు రౌడీల్లా చించివేయడం పట్ల జగదీశ్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాస్తవానికి మున్సిపాలిటీవారు కనీసం నోటీసులు ఇవ్వాలి లేదా సంబంధికులకు చెప్పాలి. అది వారి బాధ్యత. కాదంటే ఫైన్ వేయాలి. అర్ధరాత్రి అధికారులు ఫ్లెక్సీలు చించివేసిన చట్ట విరుద్ధమైన చర్యలపై అడిగేందుకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ వెళ్తే అరెస్టులు చేయడం సిగ్గు చేటు. పోలీసు రాజ్యం అమలు చేస్తామంటే కష్టం అవుతుంది. ఇది నల్లగండ జిల్లా అని గుర్తుంచుకోవాలి. మర్యాద పూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నల్లగొండ జిల్లా ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలుసు.
వెంకట్‌రెడ్డి లాంటివారు చేసిన తప్పుడు పనులు, సోయి లేకుండా ప్రజలపై చేసిన దాడుల వల్లనే నల్లగొండ జిల్లా నుంచి నాడు తిరుగుబాటు మొదలైంది. మళ్లీ అలాంటి తిరుగుబాటు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ గూండాలను ఎగేసి పంపించి కార్యకర్తలపై దాడులకు పురుగొల్పుతున్నారు. ఇరువర్గాలు గొడవ చేస్తే ఇరువర్గాలను అరెస్టు చేయాలి. అసలు కాంగ్రెస్‌కు సంబంధం లేదు. బీఆర్ఎస్, అధికారులు తేల్చుకోవాల్సిన సమస్యలో కాంగ్రెస్ వారికి ఏం పని? ఇటువంటి చిల్లర దాడులు మమ్మల్ని ఆపలేవు. కాంగ్రెస్ నాయకులం మేం తోపులం, ఇంతింత ఎత్తు మంత్రులుగా ఉన్నాం అనుకున్న నాడే బీఆర్ఎస్ ఉద్యమాలు చేసింది. కాంగ్రెస్ నిజస్వరూపం ఒక్కొక్కటిగా భయపడుతుంది. కాంగ్రెస్ రహిత తెలంగాణ కోసం నల్లగొండ నుంచే ఉద్యమం మొదలవుతుంది. కాంగ్రెస్ హఠావో తెలంగాణ బచావో నినాదం మొదలైంది. గుర్తు పెట్టుకోండి. ఇప్పటికైనా మారకపోతే కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు’ అని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
గ్రామ సభల్లో బట్టబయలైన ప్రభుత్వ ఫెయిల్యూర్
‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించిన తొలి రోజే ప్రజల నిరసనలతో ప్రభుత్వ ఫెయిల్యూర్ బయటపడింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే పైరవీలు, మోసాలు. అర్హులైనవారికి ఒక శాతమైనా లబ్ధి చేకూర్చకపోవడంతోనే ప్రజలు పెద్ద ఎత్తున గ్రామ సభలకు వచ్చి అధికారులను నిలదీశారు’ అని జగదీశ్‌రెడ్డి చెప్పారు. రెండుసార్లు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని బుట్టదాఖలు చేశారని, తీరా నేడు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామీణ పేదల తిరుగుబాటు ఆగ్రహజ్వాలల్లో కాంగ్రెస్ బూడిదకావడం ఖాయమన్నారు. తమను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ప్రజలు గుర్తించారని, కాంగ్రెస్ మోసాలపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
ఫ్లెక్సీలు చించివేయడం వల్ల బీఆర్ఎస్కు నష్టం జరిగింది. దాని గురించి అడిగేందుకు బీఆర్ఎస్ నేతలు మున్సిపాలిటీకి వెళ్లారు. మరి కాంగ్రెస్ వారికి అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? పోలీసు రాజ్యం అమలు చేస్తామంటే కష్టం అవుతుంది. ఇది నల్లగొండ జిల్లా అని గుర్తుంచుకోవాలి. మర్యాద పూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నల్లగొండ జిల్లా ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలుసు. – జగదీశ్‌రెడ్డి
వెంకట్‌రెడ్డిని సంతృప్తిపర్చేందుకు సోయిలో లేకుండా ఆయన ఇచ్చిన ఆర్డర్‌ను అమలు చేయడం సరికాదు. జిల్లా అధికారులకు చెబుతున్నా… వెంకట్‌రెడ్డి ఏది పడితే అది ఆర్డర్ ఇస్తే వాటిని అమలు చేస్తే మీరే ఇబ్బందులు పడతారు. వెంకట్‌రెడ్డి మంత్రి కావచ్చు, కానీ, సోయి లేకుండా… ఒరిజినల్‌గా ఉండే స్పృహ లేకుండా ఆయన ఇస్తున్న ఆదేశాలను అమలుచేస్తే ఇబ్బందులు తప్పవు. దయచేసి ఆలోచించి విజ్ఞతతో పనిచేయాలి.
– జగదీశ్‌రెడ్డి