హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలను, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను పకదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఈ కార్ రేసింగ్‌పై శాసనసభలో చర్చించాలని కేటీఆర్ డిమాండ్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పారిపోతున్నదని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతు భరోసా, మహిళా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను పట్టలేదని ఎద్దేవా చేశారు.
డాక్టర్లతో టెస్టులు చేయండి: తలసాని
సభకు ఎవరు తాగి వచ్చారో ప్రభుత్వ డాక్టర్లను పిలిపించి టెస్టులు చేయించాలని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ సవాల్ విసిరారు. ఏడాదిలో చేసిందేమీ లేక, చెప్పడానికేమీ లేక మీద ఎలా పడితే అలా ఎలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ రేసింగ్ మీద చర్చ పెట్టాలని కోరితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేపర్లు, బాటిల్స్ విసిరారని తెలిపారు.
ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం: ప్రశాంత్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయలేక ప్రశ్నించినవాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నదని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం చేస్తున్న అవినీతిని బయటపెడుతున్నందుకే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కుట్రతో కేసులు పెడితే నడవబోదని హెచ్చరించారు.