హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రోకు చెందిన రూ.35 వేల కోట్ల విలువైన షాపింగ్ కాంప్లెక్స్‌లు, భూములను తన దోస్తులైన అదానీ, మేఘా కృష్ణారెడ్డిలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న సంస్థను ప్రభుత్వం తీసుకోవడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. రూ.వెయ్యి కోట్లు తీసుకొని ఎల్అండ్టీ మేలు కోసం ఈ వ్యవహారం నడిపారని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఓ వైపు తనను ఎవరూ నమ్మడం లేదని, ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారని, ఉద్యోగులు జీతాలడిగితే నయాపైసా లేదని, కోసుకుతింటారా.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది’ అంటూ మాట్లాడిన సీఎం, నష్టాల్లోని సంస్థను ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. సర్కారు నిర్ణయంతో ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపారని ఆరోపించారు.
తన ఫ్యూచర్‌పై అవగాహన లేని రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌సిటీ ముసుగులో రియల్ఎస్టేట్ దందాకు తెరలేపారని దుయ్యబట్టారు. అక్కడి తన కుటుంబీకులు, బంధువుల ఆస్తులు, భూముల విలువను పెంచుకొనేందుకు ఈ డ్రామాలు చేస్తున్నారని జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు, అంగన్వాడీలు, ఆశవర్కర్ల జీతాల పెంపునకు డబ్బుల్లేవని చెబుతున్న రేవంత్‌రెడ్డి.. ఫ్యూచర్‌సిటీ ఎలా కడతారని నిలదీశారు. కేసీఆర్ పాలనలో పంచాయతీ నుంచి మండలకేంద్రానికి సింగిల్‌రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లాలకు డబుల్రోడ్లు, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఫోర్వే రోడ్లను నిర్మించారని, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం జనాలు నివసించని ప్రాంతాలకు రోడ్లు వేయాలనుకోవం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. కమీషన్ల కోసమే ఈ తతంగం నడుపుతున్నారని ఆరోపించారు. ఫ్యూచర్‌సిటీని నిర్మించి విదేశాల్లో స్థిరపడ్డ వారిని ఇక్కడకు రప్పిస్తామని సీఎం చెప్పడం హాస్యాస్పదమని దెప్పిపొడిచారు.
కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రికి, మంత్రులకు, అధికారులకు ఎంతమాత్రం సమన్వయంలేదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఒకే అంశంపై ముఖ్యమంత్రి ఓ మాట మాట్లాడితే, మంత్రులు మరోలా మాట్లాడుతున్నాని ఎద్దేవాచేశారు. ‘బెనిఫిట్‌షోకు అనుమతిచ్చి సినిమా టికెట్ల ధరల పెంపునకు సీఎం అవకాశమిస్తారు.. సంబంధిత శాఖ మంత్రేమో నాకు తెలియందంటారు.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ప్రభుత్వ పెద్దలు కమీషన్లు తీసుకొని ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతన్నారని అంటరు..’ అంటూ సమన్వయలోపాన్ని ఎత్తిచూపారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నడుపుతున్నదా? సర్కస్ నడుపుతున్నదా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ పాలనలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రహసనంలా మారిందని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల 42 శాతం కోటాపై కోర్టులో విచారణ జరుగుతుండగా హడావుడిగా షెడ్యూల్ విడుదల చేయడంలో ఆంతర్యమేంటని నిలదీశారు. బీసీ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్ ఉండగా, రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటొద్దని సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, బూడిద భిక్షమయ్యగౌడ్, దుర్గం చిన్నయ్య, నాయకులు తుంగ బాలు, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.