నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా మంత్రులు కావాలనే ఏఎమ్మార్పీని ఎండబెట్టి రైతులను ఆగం చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ‘రైతులకు వద్దకు పోదాం.. పానగల్ ఉదయ సముద్రం కట్ట మీద చర్చ పెడదాం. కేసీఆర్ ఉండగా నీళ్లు ఎలా వచ్చాయో.. ఇప్పుడెందుకు రావడం లేదో తేల్చుదాం. అసలు నాగార్జునసాగర్‌కు నీళ్లే రాకపోతే మేమూ అడగకపోయే వాళ్లం. సాగర్ నుంచి నీళ్లు సముద్రం పాలవుతుంటే ఇక్కడ ఏఎమ్మార్పీకి నీళ్లు లేకపోవడం మీకు చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. దీనినుంచి తప్పించుకునే మాటలు వద్దు.
ఏఎమ్మార్పీ మోటర్లు కాలిపోతే రిపేర్లు చేయాలనే సోయి నల్లగొండ జిల్లా మంత్రులకు ఉండాలి కదా?. కనీసం సమీక్ష చేయాలి కదా?. మోటర్లు రిపేరు చేస్తే కమీషన్లు రావనే చేయడం లేదా? కమీషన్లు వచ్చే వాటిపైనే మీకు దృష్టి ఉంటుందా? రైతులంటే ఇంత చిన్నచూపా? జిల్లా మంత్రులకు నేరుగా డిమాండ్ చేస్తున్నా.. ఏఎమ్మార్పీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వాలి, ప్రతి ఎకరాకు పారించాలి’ అని డిమాండ్ చేశారు.
మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి పానగల్ ఉదయ సముద్రాన్ని పరిశీలించారు. 1.5 టీఎంసీల సామర్థ్యం నీటితో కళకళలాడాల్సిన ఉదయ సముద్రం 0.7 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ నుంచి వృథాగా నీళ్లు సముద్రంలో కలుస్తుంటే ఏఎమ్మార్పీ ఆయకట్టులో వేలాది ఎకరాలు నీళ్లు లేక బీడుభూములుగా మారినట్టు ఆందోళన చెందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా మంత్రులకు రైతుల పట్ల ఏ మాత్రం సోయి లేదని విమర్శించారు. వీరి ధ్యాసంతా దందాలు, కమీషన్లపైనేనని దుయ్యబట్టారు.
ఢిల్లీ దాక పోయి కేంద్ర మంత్రి గడ్కరిని కలిసేందుకు టైం దొరకుతది గానీ.. రైతులకు నీళ్లు ఇవ్వడానికి టైం లేదా? అని మంత్రులు కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను ప్రశ్నించారు. యాసంగిలో నీళ్లు ఇవ్వకపోతే ఎస్.లింగోంటంతో పాటు పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే సెల్ఫీలు తీసి కేసీఆర్ హయాంలో నీళ్లొచ్చాయి.. ఇప్పుడు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది నిజం కాదా? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.
క్షుద్రపూజలు ఉన్నాయని చెప్పడం, ప్రజలను నమ్మించే పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవిలో కొనసాగే అర్హత కూడా లేదని జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించే వారు ఉండాల్సింది జైలులో తప్ప, మంత్రి వర్గంలో కాదని అన్నారు. ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.