సూర్యాపేట, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ‘అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి, మాకు అవకాశం ఇవ్వాలని అడిగితే భయమెందుకు? అసెంబ్లీలో మీరు పీపీటీ పెట్టండి.. మాకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు అసలు దొంగలెవరో బయటపడతారు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో పీపీటీ నిరాకరణ, ఆంధ్ర నల్లమల సాగర్ నీటి దోపిడీపై బుధవారం ఆయన సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మీరు అడ్డుకున్నట్టు మే ము అడ్డుకోబోం. పీపీటీలో అవకాశమిస్తే కాంగ్రెస్ బండారం బయటపడుతుంది. అందుకే బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. మీ స్క్రీన్‌పైనే మీ కాంగ్రెస్ ప్రభుత్వ బాగోతం బయటపెడతాం. మీ వాళ్ల అసలు రంగు వెలుగులోకి వస్తుందనే భయంతో బీఆర్ఎస్ అడిగిన పీపీటీకి మొండిచేయి చూపుతున్నారు’ అని విమర్శించారు. ఇస్తే రేవంత్ ద్రోహాన్ని ఎండగడతామని స్పష్టంచేశారు.