సూర్యాపేట, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : మునుగోడు ఉప ఎన్నిక అంటేనే బీజేపీ వణికిపోతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బీజేపీ జరిపించుకొన్న అన్ని సర్వేల్లో ఆ పార్టీకి మూడో స్థానమే అని తేలిందని, దీంతో భయం పట్టుకొన్నదని పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన తెల్లారే ఉప ఎన్నిక అన్నోళ్లు ఇప్పుడు ఓటమి భయంతో ఆ ఊసే ఎత్తడం లేదని తెలిపారు. ప్రస్తుతం మునుగోడులో ఉప ఎన్నిక నిర్వహించే ధైర్యం ఆ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. ఒక నియోజకవర్గంలోనే ఎన్నికలను ఎదుర్కోలేని వాళ్లు ముందస్తు గురించి మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు.
మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం యరగండ్లపల్లి సర్పంచ్ మాడెం శాంతమ్మ-వెంకటయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బుధవారం మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మర్రిగూడ మండలం యరుగండ్లపల్లి సర్పంచ్ మాడెం శాంతమ్మ, అజ్జలాపురం సర్పంచ్ డందేటికార్ అనసూయ అంజయ్య, తిరుగండ్లపల్లి సర్పంచ్ అయితపాక జంగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కిష్టాపూర్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాగా దామెర భీమనపల్లి, కమ్మగూడెం, బోజ్యాతండా, భీమ్లాతండా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 కుటుంబాల వారు గురువారం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. నాంపల్లి మండలంలోని రాందాస్ తండా గ్రామ పంచాయతీ పరిధి రావికుంట తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు 60 మంది, జాన్తండాకు చెందిన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మెగావత్ యాదగిరితోపాటు మరో 20 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.