హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో 18న విశ్రాంతి ఉద్యోగుల సారథ్య కమిటీ తలపెట్టిన ‘ఉపవాస దీక్ష’కు జేఏసీ మద్దతు ప్రకటించింది. జేఏసీ భాగస్వామ్య సంఘాల విశ్రాంత ఉద్యోగులు దీక్షలో పాల్గొనాలని జేఏసీ చైర్మన్ వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్లు యాదయ్య, సురేశ్, యాదగిరి పిలుపునిచ్చారు. 2017 వేతన సవరణ బకాయిలు, పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, టర్మినల్ లీవ్స్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, 2021 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం మానవీయకోణంలో పరిషరించాలని ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని కోరారు.