హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 27 మందితో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఉద్యోగుల జేఏసీ నేతలు జగదీశ్వర్, శ్రీనివాసరావు వెల్లడించారు. రెండు రోజుల్లో వందమందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. శుక్రవారం జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇచ్చిన ఆగస్టు 15 గడువు ముగిసిందని పేర్కొన్నారు. ‘ఉద్యమంలో ఫుల్‌టైం ట్రైనింగ్ అయినోళ్లం. మా డిమాండ్లు ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా తమ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకపోవడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 1న బ్లాక్‌డేగా పరిగణించి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.