హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరించిన ఉద్యోగ సంఘాల జేఏసీ వెనక్కి తగ్గింది. ఉద్యమ కార్యాచరణను వాయిదావేసింది. ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన నల్లబ్యాడ్జీలతో నిరసన ఉండబోదని తాజాగా ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.
నాంపల్లి టీఎన్జీవో భవన్లో నిర్వహించిన ఈ సమావేశం అనంతరం జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూ రి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. 57 డిమాండ్లపై అధికారులతో క మిటీ వేసినందున ఈ నెల 15న మ ధ్యాహ్న భోజన సమయంలో జరగాల్సిన ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు చెప్పారు. జూన్ 9న లక్ష మందితో నిర్వహించనున్న మహాధర్నాపై నిర్ణయాధికారాన్ని మాత్రం జేఏసీ చైర్మన్‌కు వదిలేసినట్టు తెలిపారు.
సోమవారం డిప్యూటీ సీఎం భట్టి తమతో చర్చలు జరిపారని, ఆర్థికభారం లేని వాటిని ఇప్పుడు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తాము ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లలో అమలు సాధ్యమయ్యేవి, సాధ్యం కానివి చెప్పాలని కోరామని తెలిపారు.
తామేమీ బోనస్‌లు, అదనపు భత్యాలే వీ అడగడం లేదని మారం జగదీశ్వర్ తెలిపారు. జీతాల పెంపు, అదనపు కోరికలు కోరడం లేదని చెప్పారు. ప్రజల ముందు తమను దోషులుగా నిలబెట్టవద్దని సర్కారును కోరారు. డీఏలు పెరిగిన ధరల ప్రకారం ప్రకటించాల్సినవని, ఇంకో నెల గడిస్తే ఆరు డీఏలను సర్కారు బాకీపడుతుందని పేర్కొన్నారు. సర్కారు నుంచి స్పందన లేకపోవడంతోనే కార్యాచరణను ప్రకటించామని వివరించారు.
సర్కారు సత్వరమే 47 ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. 10 వేల కోట్ల పెం డింగ్ బిల్లులను చెల్లించాలని, 5 డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 51% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు పుల్గం దామోదర్‌రెడ్డి, ఎస్ఎం ముజీబ్ హుస్సే ని, ఎనుగుల సత్యనారాయణ, వంగ రవీందర్‌రెడ్డి, బీ శ్యామ్, ముత్యాల సత్యనారాయణగౌడ్, కటకం రమేశ్, పర్వత్‌రెడ్డి, దారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.