కరీంనగర్ తెలంగాణచౌక్, జనవరి 14: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ గ్రానైట్, ఇతర వ్యాపారులను బెదిరిస్తూ కోట్లు వసూలు చేస్తున్నడు. మొన్నటిదాకా కార్పొరేటర్‌గా కేవలం బైక్‌పై తిరిగిన ఈయన.. మూడేండ్లలోనే కోట్లాది రూపాయలు ఎలా సంపాదించాడో చెప్పాలి. ఆయన ఆస్తుల మీద విచారణ చేయాలి. ఈడీ, సీబీఐతో దర్యాప్తు జరిపించాలి’ అని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జెల కాంతం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ రాష్ర్టాభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. విభజన హామీలు, రాష్ట్ర అవసరాల గురించి ఒక్కనాడూ పార్లమెంట్లో మాట్లాడిన పాపాన పోలేదని దుయ్యబట్టారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు ఉగ్రవాద, తీవ్రవాద సంస్థల కన్నా ప్రమాదకరమని, ఆ సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టగానే కేంద్రంలోని బీజేపీ నాయకులకు భయం పట్టుకున్నదని అన్నారు. కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద సీబీఐ, ఈడీ దాడులను చేయిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడంతోపాటు ఉచిత విద్యుత్తు, రైతుబీమా, రైతుబంధు లాంటి పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఆయన ప్రధాని అయితే దేశంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుపడుతారని అన్నారు.