ఖైరతాబాద్, జనవరి 6: 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే దేశంలో నిరుద్యోగ సమస్య ప్రారంభమైందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగం, ఉద్యోగులు, ఉపాధ్యాయుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆ పార్టీ నాయకులకు లేదని తెలిపారు. గురువారం హైదరాబాద్ లక్డీకాపూల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల పేరు చెప్పి బీజేపీ నేతలు దొంగ దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 2014లో బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, ఈ ఏడేండ్లలో 14 కోట్లు ఉద్యోగాలు ఇచ్చా రా అని ప్రశ్నించారు. 70 కోట్ల మంది యువతను కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్డీయేకు ముందు ఏటా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ఆధారంగా 2.73 లక్షల ఉద్యోగాలు వచ్చేవని, బీసీలకు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవారని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను తొలగించడంతోపాటు ప్రైవేటీకరణ చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. చైనా, పాక్ కంటే బీజేపీ, ఆరెస్సెస్‌లే ప్రమాదకరమని పేర్కొన్నారు. గాడ్సేకు మద్దతు పలికేవారు మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేయడం హస్యాస్పదమని, జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని చూసి ప్రజలు నవ్వుకొంటున్నారని అన్నారు. పంజాబ్‌లో ప్రధానికి సరైన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. అక్కడ ఎన్నికల సభకు ప్రజలు రాకపోవడంతోనే మోదీ వెనుదిరిగారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శనివారం ఇందిరా పార్కు వద్ద చేపట్టాల్సిన నిరసన దీక్షను కరోనా నేపథ్యంలో వాయిదా వేసుకున్నామని చెప్పారు.