మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 26 : లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ట డిమాండ్ చేశారు. ఆదివారం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కుమ్రంభీం విగ్రహానికి నివాళులర్పించిన ఆదివాసీలు ఒక్కసారిగా ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలుపడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ చుంచు రామకృష్ణ మాట్లాడుతూ కొండలు, గుట్టల్లో, ఊరి చివరన నివాసముంటున్న ఆదివాసీల రిజర్వేషన్లు, హక్కులను లంబాడీలు అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఎస్టీ రిజర్వేషన్లో లంబాడీలకు చట్టబద్ధత లేదని, వెంటనే వారిని తొలగించాలని డిమాండ్ చేశారు.
శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వకుండా చేశారని ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. మానుకోట ప్రాంతంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మురళీనాయక్, రామచంద్రునాయక్, ఎంపీ పోరిక బలరాంనాయక్ ఆదివాసీలపై అనేక రకాల ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. కేవలం 9వ తరగతి చదివిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ అధికార బలంతో దేశంలోని ఐఏఎస్, ఐపీఎస్‌లను అగౌరవ పరుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.