హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో కుదుర్చుకున్న ఎంవోయూలు గ్రౌండింగ్ కావడానికి సమయం పడుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసింది ఎక్కువైనా తక్కువగా చెప్పుకుంటున్నదన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారిని తాము ప్రోత్సహిస్తున్నామని, అందులోభాగంగానే గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల ఎంవోయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టిమెంట్స్కు తెలంగాణ బై చాయిస్ కాదు, బై డెస్టినేషన్‌గా మారిందని, పారిశ్రామిక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని మంత్రి ప్రకటించారు.