హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మహిళా సాధికారతకు చిహ్నంగా ఉండాల్సిన ‘స్త్రీనిధి’ ఫెడరేషన్ ఇప్పుడు అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అడ్డాగా మారింది. దాదాపు రూ.5,500 కోట్ల భారీ టర్నోవర్ కలిగిన ఈ సంస్థలో కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా లేకపోవడం గమనార్హం. పూర్తిగా కన్సల్టెంట్లు, కాంట్రాక్ట్, తాతాలిక సిబ్బందితోనే ‘స్త్రీనిధి’ సంస్థ నెట్టుకొస్తున్నది. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ నిబంధనల ప్రకారం.. రూ.350 కోట్లకుపైగా టర్నోవర్ ఉన్న ఏ ప్రభుత్వ రంగ సంస్థకైనా ఐఏఎస్ లేదా గ్రూప్-1 స్థాయి అధికారి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ఉండాలి. కానీ, ‘స్త్రీనిధి’లో మాత్రం 2011 సెప్టెంబర్ నుంచి జీ విద్యాసాగర్‌రెడ్డి అనే రిటైర్డ్ కన్సల్టెంట్ పాతుకుపోయారు. దశాబ్దకాలానికిపైగా ఆయన ఎండీగా కొనసాగడం వెనుక రాజకీయ పలుకుబడి, లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘స్త్రీనిధి’ సంస్థలో రిటైర్డ్ కన్సల్టెంట్ల ఆగడాలు, వేధింపులు తాళలేక 2018 నుంచి ఇప్పటివరకు దాదాపు 450 మంది సిబ్బంది రాజీనామాలు చేసి రోడ్డున పడ్డారు. వీరిలో 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే. అణగారినవర్గాల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మానసిక వేధింపులపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నదో అర్థం కావడం లేదని బాధిత సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ‘స్త్రీనిధి’లో 266 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. ఇటీవల జీబీ ఆమోదం పొందిన 163 పోస్టుల్లో ప్రస్తుతం 153 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో 20 కన్సల్టెంట్ పోస్టులు, 10 ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిస్ (ఎఫ్‌టీఈ) పోస్టులు, 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ రిజర్వేషన్లను పాటించలేదు. పాత రోస్టర్‌ను అనుసరించలేదని, ప్రభుత్వ నిబంధనలను పాటించలేదని తెలుస్తున్నది. ప్రభుత్వ పెద్ద ల అనుచరులతోపాటు మంత్రి పేషీలోని సిబ్బందికి కొన్ని పోస్టులు బ్యాక్‌డోర్‌లో కట్టబెట్టేందుకు నోటిఫికేషన్లో మార్పులు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్, మే 13(నమస్తే తెలంగాణ): స్త్రీనిధిలో కన్సల్టెన్సీల నియామకం పేరుతో విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్‌పై పెద్ద దుమారం చెలరేగిన నేపథ్యంలో ఈ నెల 16న ప్రజాభవన్‌లో నిర్వహించబోయే స్త్రీనిధి రాష్ట్రస్థాయి సమావేశంపై అందరి దృష్టి నెలకొన్నది. ఈ సమావేశంలో ‘ఉద్యోగుల సంక్షేమం, సంస్థ బలోపేతం’పై చర్చిస్తారని పైకి చెప్తున్నా అసలు ఎజెండా వేరే ఉన్నట్టు తెలుస్తున్నది. క్షేత్రస్థాయి సమస్యలను పరిషరించడం కంటే, సంస్థపై వస్తున్న వార్తలను ఖండించడానికి, ఉన్నతాధికారుల పోస్టులను కాపాడుకునేందుకే ఈ వేదికను వాడుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఎండీ విద్యాసాగర్‌రెడ్డి సేవలను ఎక్స్-అఫీషియో చైర్మన్‌గా కొనసాగించాలని ఉద్యోగులందరితో తీర్మానం చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం. రిటైర్ అయినా కొన్నేండ్లుగా ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న ఆయన ఉద్యోగకాలం ఈ నెల 23తో ముగియనున్నది.
ఈ నేపథ్యంలో ఆయ న్ను సంస్థలోనే కొనసాగించాలనే అంశంపై కొందరు పట్టుబట్టాలని చూడటం, సంస్థ అభివృద్ధి కంటే ఒక వ్యక్తి పోస్టును కాపాడటమే లక్ష్యంగా ఈ సమావేశం సాగుతుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ ఉద్యోగుల సమస్యల కంటే ఉన్నతాధికారుల ఉద్యోగకాలం పొడిగింపుపైనే యాజమాన్యం దృష్టిసారిస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర మంత్రులు, సెక్రటరీ స్థాయి వ్యక్తులు హాజరవుతున్న ఈ సమావేశాన్ని, తమ వ్యక్తిగత ఎజెండాలను అమలు చేసుకునేందుకు అధికారులు పావుగా వాడుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. తమ సమస్యలు చెప్పుకొనేందుకు వేదిక దొరుకుతుందని ఆశించిన సిబ్బందికి పత్రికా వార్తలను ఖండించాలని, అధికారుల పోస్టుల కోసం తీర్మానాలు చేయాలని కోరడం మింగుడు పడటం లేదు. ఇది కేవలం ఉన్నతాధికారుల ఆధిపత్యాన్ని ప్రదర్శించే సమావేశంగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.