కోరుట్ల, నవంబర్ 25: ఉపాధి కోసం గల్ఫ్ బాటపట్టిన కార్మికులను బీజేపీ మోసం చేసిందని బీఆర్ఎస్ ఎన్నారై బెహరాన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఆయన ఎన్నారై బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ సర్కార్, అంతకుముందు పాలించిన కాంగ్రెస్ గల్ఫ్ కార్మికుల సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్నో సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ మంత్రులను కలిసి కనీస వేతనాల కల్పనకు కృషి చేయాలని, ఫిలిప్పీన్స్ దేశం తరహాలో గల్ఫ్‌లో చట్టాలు తీసుకువచ్చేందుకు ఆయా దేశాలపై ఒత్తిడి చేయాలని విన్నవించినా పెడచెవిన పెట్టారని ఆరోపించారు. బీజేపీ అభివృద్ధి పనులు చేయడం చేతగాక కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ గల్ఫ్ కార్మిక కుటుంబాలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్యప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొంటున్నారని దుయ్యబట్టారు. గల్ఫ్ కుటుంబాలు బీ ఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.