హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ అనాదిగా బీఆర్ఎస్ కంచుకోట అని, రాబోయే రోజుల్లో జిల్లాలో ‘కారు’ సునామీ సృష్టించడం ఖాయమని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలు, మోసాల వల్లే కొన్ని స్థానాలను కోల్పోయామని గుర్తుచేశారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ విఫల పాలన తర్వాత ప్రజలందరూ తిరిగి కేసీఆర్ నాయకత్వం వైపే చూస్తున్నారని చెప్పారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో కూడా కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ గాలి బలంగా ఉన్నట్టు వెల్లడైందని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, సమకాలీన రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ వైఫల్యాలపై ఈ సమావేశంలో చర్చించారు.
గ్రామాల స్థాయిలోనే కాకుండా, ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, ఇందుకోసం బూత్‌స్థాయి కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అధికారం ఉన్నా, లేకున్నా పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తనూ గుండెల్లో పెట్టుకోవాలని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపైనే ఉన్నదని స్పష్టంచేశారు. వర్షాలు లేని ప్రస్తుత తరుణంలోనూ కాళేశ్వరంలో నీరు అందుబాటులో ఉన్నా రైతులకు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలు, ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని సూచించారు. సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను, అవినీతిని కార్మికులు, ప్రజలముందుకు తీసుకువెళ్లాలని కోరా రు. మారుతున్న కాలానికనుగుణంగా సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించుకొని, కాంగ్రెస్నేతల అవినీతిని, అరాచకాలను ఎం డగట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులు, సభ్యత్వ నమోదు పురోగతిని కేటీఆర్‌కు వారు వివరించారు.