హైదరాబాద్, అక్టోబరు 17 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిపడిన 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈనెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో 17.29 శాతం డీఏలపై చర్చించి, దీపావళి కానుకగా బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. గురువారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా మూడు శాతం కరువు భత్యం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలను గుర్తు చేస్తున్నానని అన్నారు. డీఏలు విడుదల చేయకపోవడం వల్ల ఒకో ఉద్యోగి నెలకు సుమారు రూ.5వేల నుంచి రూ.20వేల వరకు నష్టపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చి 31 తర్వాత రిటైర్డ్ అయిన సుమారు 5వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్డ్మెంట్ బెన్ఫిట్స్ పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన నూతన ఈహెచ్ఎస్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని
డిమాండ్ చేశారు.