హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): దక్షిణ భారతదేశంలోని అగ్రశ్రేణి బిల్డర్లలో ఒకటైన డీఎస్ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూపు పై ఆదాయపన్ను శాఖ అధికారులు పంజా విసిరారు. పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఆ సంస్థకు చెందిన పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు చేపట్టారు. బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, చెన్నై లో మొత్తం 27 ప్రాంతాల్లో తనిఖీలు జరిపా రు. డీఎస్‌ఆర్‌లో భాగస్వామిగా ఉన్న మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డితోపాటు ఆ సంస్థ డైరెక్టర్లు దేవిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డీ ప్రభాకర్‌రెడ్డి, వారి బంధువులు, సన్నిహిత సహచరుల ఇండ్లు, కార్యాలయాలు, ఆ కంపెనీ ప్రా జెక్టు సైట్లలోనూ సోదాలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్‌లోని డీఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయంతోపాటు డీఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో సోదాలు కొనసాగాయి. జూబ్లీహిల్స్‌తోపాటు బంజారాహిల్స్, ఎస్ఆర్నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, సూరారం తదితర 10 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు జరిపి, 5 ఏండ్ల నుంచి ఆ సంస్థ చెల్లించిన పన్నులపై ఆరా తీశారు. సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య జరిగిన ఈ సోదాల్లో అక్రమ లావాదేవీలకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను, డిజిటల్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. డీఎస్ఆర్ సైవన్, డీఎస్ఆర్ వరల్డ్ వెంచర్స్ లాంటి ప్రాజెక్టుల్లో ఒక్కో ఫ్లాట్‌ను చదరపు అడుగుకు రూ.12 వేల నుంచి రూ.13 వేలకు విక్రయించారని, రిజిస్ట్రేషన్లలో మాత్రం కేవలం రూ.7 వేలుగా చూపారని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం.