హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాతల ఇండ్లలో మంగళవారం ఇన్‌కం ట్యాక్స్ అధికారులు చేపట్టిన సోదాలు కలకలం రేపాయి. ఇటీవల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలకు భారీగా వసూళ్లు వచ్చాయి. దీంతో ఆయా సినిమాలకు వచ్చిన లాభాలు, చెల్లించిన పన్నులపై ఐటీ అధికారులు దృష్టిసారించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 6 గంటల నుంచే 200 మందితో కూడిన 55 ఐటీ బృందాలు నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, అతని కుమార్తె హన్షిత రెడ్డి, సోదరుడు నర్సింహారెడ్డి, వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేపట్టారు. దిల్ రాజుతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని, సీఈవో చెర్రీ కార్యాలయాలు, ఇండ్లలోనూ సోదాలు చేపట్టారు. వారితో పాటు మ్యాంగో మీడియా సంస్థలకు చెందిన ప్రముఖ సింగర్ సునీత, ఆమె భర్త వీరపనేని రామకృష్ణ (రాము), వారి భాగస్వాముల ఇండ్లల్లోనూ సోదాలు జరిగాయి. అలాగే నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీస్‌లో, ‘సత్య రంగయ్య’ ఫైనాన్స్ కంపెనీ ఆఫీస్‌లో కూడా సోదాలు నిర్వహించారు.
ఆయా నిర్మాణ సంస్థలు పన్నుల చెల్లింపుల్లో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. గతంలోనూ సినిమా నిర్మాతల ఇండ్లలో సోదాలు జరిగినా.. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సోదాలు కొనసాగిన దాఖలాలు లేవు. ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలను దిల్‌రాజు నిర్మించారు. దీంతోపాటు ‘డాకు మహారాజ్’ మూవీ డిస్ట్రిబ్యూషన్లో దిల్‌రాజు పాలుపంచుకున్నారు. వచ్చిన లాభాల్లో దిల్ రాజు ఐటీ శాఖకు పన్నులు సరిగా చెల్లించలేదని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ కూడా అవకతవకలకు పాల్పడినట్టు గుర్తించారు.
దిల్‌రాజు సంస్థకు సంబంధించి బ్యాంకు స్టేట్మెంట్లు, లాకర్ల వివరాలు అడగగా.. ఆయన భార్య తేజశ్విని బ్యాంకు వెళ్లారు. బుధవారం కూడా సోదాలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఐటీ బృందాలు స్వాధీనం చేసుకునే పత్రాల పరిశీలన తర్వాతే ఐటీ ఎగవేత జరిగిందా? లేదా? అన్నది వెల్లడవుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇందులో రాజకీయ ఎత్తుగడ కూడా లేకపోలేదని తెలుస్తోంది.