కేరళలో కూడా పారిశ్రామికవేత్తల సమావేశం ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరాను. అక్కడి పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అమెరికాలో వ్యాపారాలు చేస్తున్న కేరళీయులు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంపై నన్ను వాకబు చేశారు.
– సాబూ ఎం జాకబ్, కిటెక్స్ ఎండీ
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్నదని, ఇక్కడ వ్యాపారాలకు అద్భుత అవకాశాలున్నాయని చిన్నపిల్లల దుస్తుల తయారీలో దిగ్గజ సంస్థ కిటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ సాబూ ఎం జాకబ్ ప్రశంసించారు. ముఖ్యంగా కే తారకరామారావు వంటి మంత్రి తెలంగాణలో ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. మంత్రి సహకారం, ప్రభుత్వ పనితీరు, ఇక్కడి అధికారుల స్నేహ స్వభావం తదితర కారణాలతో రాష్ట్రంలో తన పెట్టుబడిని రూ.3 వేల కోట్లకు పెంచినట్టు చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని హోటల్ ఐటీసీ కాకతీయలో నిర్వహించిన సీఐఐ వార్షిక సమావేశంలో జాకబ్ పాల్గొని కేరళలో తన కంపెనీని ఎత్తివేసి తెలంగాణలో ఏర్పాటు చేయడానికి గల కారణాలు, ఇక్కడ ప్రభుత్వం నుంచి లభించిన సహకారం గురించిన అనుభవాలను వివరించారు.
కేరళలో రూ. 3 వేల కోట్లు పెట్టుబడి పెట్టి 15 వేల మందికిపైగా ఉద్యోగాలు కల్పించినా అక్కడి రాజకీయ వ్యవస్థ నుంచి అనేక వేధింపులు ఎదురయ్యాయని, తమను గుర్తించకపోవడమే కాకుండా అక్కడ నుంచి తమ కంపెనీని తరిమికొట్టేలా పరిస్థితులు సృష్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. కేరళలో కూడా ఇటువంటి పారిశ్రామికవేత్తల సమావేశం ఏర్పాటుచేయాలని తాను మంత్రి కేటీఆర్‌ను కోరినట్టు చెప్పారు. అక్కడి పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నట్టు తెలిపారు. కేరళలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. తన తండ్రి 1968లో పదిమంది ఉద్యోగులతో కేరళలో పరిశ్రమను ఏర్పాటుచేస్తే, నేడు 15 వేల మంది అందులో పనిచేస్తున్నారని వివరించారు. తమ కంపెనీలో తయారైన చిన్నపిల్లల దుస్తులు అమెరికాకు ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు. కేరళలోని తమ కంపెనీ నుంచి రోజూ ఒక మిలియన్ చిన్నపిల్లల దుస్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయని, అయినా తమకు అక్కడ సముచిత ప్రాధాన్యం ఇవ్వకపోగా అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారని తెలిపారు.
తాను 2021లో కేరళలో తన కంపెనీని మూసివేసి ఇతర రాష్ర్టాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పుడు అనేక రాష్ర్టాల సీఎంలు, చీఫ్ సెక్రటరీలు ఫోన్ చేశారని జాకబ్ గుర్తుచేశారు. ‘ఒకరోజు మంత్రి కేటీఆర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు నేను కేటీఆర్‌ను ఒక్కటే మాట అడిగా. మీకు పెట్టుబడి కావాలా? ఉద్యోగాలు కావాలా? అని అడిగినప్పుడు ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు కావాలని, అదే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రజలపట్ల, రాష్ట్ర అభివృద్ధిపట్ల మంత్రి కేటీఆర్‌కు ఉన్న నిబద్ధత నన్ను ఎంతగానో ఆకట్టుకొన్నది. ఆ వెంటనే నేను తెలంగాణకు వచ్చేందుకు సిద్ధమయ్యాను. కొవిడ్ కారణంగా ఇక్కడికి రావడం ఇబ్బందిగా ఉండటంతో కేటీఆర్ 24 గంటల్లో నాకోసం చార్టర్డ్ విమానం పంపారు. ఇక్కడికి వచ్చాక హెలికాప్టర్లో కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్ (కేఎంటీపీ)కు తీసుకెళ్లారు. ఇక్కడి ప్రభుత్వం మాతో వ్యవహరించిన తీరు, ఆతిథ్యం నన్ను ముగ్ధుడిని చేశాయి. కేఎంటీపీకి వెళ్లి వచ్చిన రోజు నేను అక్కడ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టి 4 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించాను. ఆ మరుసటి రోజే హైదరాబాద్ సమీపంలోని సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌ను సందర్శించాను. అది నాకు నచ్చడంతో తెలంగాణలో రూ.2000 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం. కేటీఆర్‌తో చర్చల తర్వాత మా పెట్టుబడిని రూ.2,400 కోట్లకు పెంచి సీతారాంపూర్, వరంగల్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నాం. ఈ రోజు (మంగళవారం) ఉదయం కేటీఆర్‌తో సమావేశం అనంతరం మా పెట్టుబడిని మరో రూ.600 కోట్లు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నాం’ అని వివరించారు.
వచ్చే మూడు నుంచి ఐదేండ్లలో తెలంగాణ నుంచి 2.5 మిలియన్ పీసెస్ చిన్న పిల్లల దుస్తులు అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేస్తాం. రానున్న రోజుల్లో తెలంగాణలో తయారైన దుస్తులు ధరించని పిల్లవాడు ఒక్కడు కూడా అమెరికాలో కనపడరు.
– జాకబ్, కిటెక్స్ ఎండీ
ఒకరోజు మంత్రి కేటీఆర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు నేను కేటీఆర్‌ను ఒక్కటే మాట అడిగా. మీకు పెట్టుబడి కావాలా? ఉద్యోగాలు కావాలా? అని అడిగినప్పుడు ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు కావాలని, అదే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రజలపట్ల, రాష్ట్ర అభివృద్ధిపట్ల మంత్రి కేటీఆర్‌కు ఉన్న నిబద్ధత నన్ను ఎంతగానో ఆకట్టుకొన్నది. ఆ వెంటనే నేను తెలంగాణకు వచ్చేందుకు సిద్ధమయ్యాను. ఇక్కడి ప్రభుత్వం మాతో వ్యవహరించిన తీరు, ఆతిథ్యం నన్ను ముగ్ధుడిని చేశాయి.
– జాకబ్, కిటెక్స్ ఎండీ
వరంగల్‌లోని కేఎంటీపీలో ఏర్పాటుచేస్తున్న పరిశ్రమ మొదటి దశ పనులు తుదిదశకు చేరుకొన్నాయని, వచ్చే జూన్ – జూలైలో ఉత్పత్తి ప్రారంభిస్తామని జాకబ్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 28 వేల పైచిలుకు మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇందులో 80 శాతం మహిళలు, అన్‌స్కిల్డ్ వర్కర్లు ఉంటారని, అవసరమైన శిక్షణ తామే ఇప్పించి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. వచ్చే మూడు నుంచి ఐదేండ్లలో తెలంగాణ నుంచి 2.5 మిలియన్ పీసెస్ చిన్న పిల్లల దుస్తులు అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణలో తయారైన దుస్తులు ధరించని పిల్లలు ఒక్కరు కూడా అమెరికాలో కనపడరని జాకబ్ ధీమా వ్యక్తంచేశారు.
కేటీఆర్ వంటి మంత్రి కేరళలో కూడా ఉంటే బాగుండునని అక్కడి పారిశ్రామికవేత్తలు, ప్రజలు కోరుకొంటున్నారని జాకబ్ చెప్పారు. తన అనుభవాలను తెలుసుకొని మరింతమంది కేరళ పెట్టుబడిదారులు తెలంగాణకు వస్తున్నట్టు తెలిపారు. ఇంత గ్రేట్ మినిస్టర్ మీకు ఉండటం అదృష్టమని కొనియాడారు. మరింతమంది మలయాళీలకు తెలంగాణలో అవకాశాలు కల్పించాలని కోరారు. చాలామంది ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టిన మలయాళీలు తెలంగాణలో పరిస్థితులను గురించి తనను వాకబు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడి ప్రభుత్వం, మంత్రితోపాటు అన్ని శాఖల అధికారులు ఎంతో స్నేహభావంతో మెలుగుతున్నారని, ఎంతో సహకరిస్తున్నారని ఆనందం వ్యక్తంచేశారు.
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి చేయూతనందించాల్సిన కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని ధ్వజమెత్తారు. విభజన హామీలను కూడా నెరవేర్చనప్పుడు ఆ చట్టాలకు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా నినాదం వినడానికి ఎంతో బాగున్నప్పటికీ అది కార్యరూపం దాల్చడంలేదని ధ్వజమెత్తారు. మంగళవారం భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ విభాగం వార్షిక సమావేశంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని పచ్చదనంలో ప్రగతి సాధించిన పరిశ్రమలకు గ్రీన్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ప్రస్తుతం ప్రారంభించిన అన్ని పనులూ పూర్తిచేస్తామని ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్క్, జీనోమ్వ్యాలీతోపాటు టెక్, టెక్స్టైల్స్ రంగాల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. మేం చేపట్టిన పనులన్నింటినీ పూర్తిచేస్తాం. పారిశ్రామికవేత్తలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.
– మంత్రి కేటీఆర్
ప్రపంచ వ్యాక్సిన్లలో ప్రస్తుతం 35 శాతం హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే ఏడాది చివరికల్లా ఇది 50 శాతానికి పెరగనున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం తొమ్మిది బిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇక్కడ ఉత్పత్తి అయిందని, 2024 చివరి నాటికి 14 బిలియన్ డోసులకు ఉత్పత్తి పెరుగుతుందని చెప్పారు. దేశ ఔషధాల ఉత్పత్తిలో 40 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి పొందిన ఔషధ తయారీ పరిశ్రమలు తెలంగాణలో 214 ఉన్నాయని, ఒకే ప్రాంతానికి చెందిన ఇన్ని కంపెనీలకు ఎఫ్‌డీఏ అనుమతులు ప్రపంచంలో మరెక్కడా లేవని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సూచన ప్రకారం పటాన్చెరులో ఏర్పాటుచేసిన మెడికల్ డివైజెస్ పార్క్‌లో 50 కంపెనీలు ఉత్పత్తులు కొనసాగిస్తున్నాయని, మరో 30కిపైగా కంపెనీలు త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ కేంద్రం ఇక్కడే ఉన్నదని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని ఏర్పాటుచేస్తున్నామని, ఇది ప్రారంభమైతే ఎనిమిది బిలియన్ డాలర్లకంటే ఎక్కువ పెట్టుబడులు, ఐదు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు.
టెక్నాలజీలో సైతం తెలంగాణ శరవేగంగా ముందుకు సాగుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికతలోనూ రాష్ట్రంలోని మారుత్ డ్రోన్స్, ధృవ స్పేస్, స్కైరూట్ వంటి స్టార్టప్‌లు అపురూప విజయాలు సాధిస్తున్నాయని చెప్పారు. అమెజాన్, గూగుల్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఉబర్, క్వాల్కామ్ తదితర ప్రపంచ దిగ్గజ కంపెనీల రెండో అతిపెద్ద కార్యాలయాలు హైదరాబాద్‌లో ఏర్పాటైనట్టు గుర్తుచేశారు. రాష్ట్రంలో పది లక్షలకుపైగా ఉద్యోగులు టెక్నాలజీ రంగంలో ఉపాధి పొందుతున్నారని తెలిపారు. లైఫ్ సైన్సెస్‌లో నాలుగున్నర లక్షలమంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సౌకర్యాలకు పేరుగాంచిన స్నైడర్ లైట్‌హౌస్ కంపెనీ హైదరాబాద్ నుంచే టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్నదని తెలిపారు.
వృత్తి నిపుణులకు రాష్ట్రంలో పుష్కలమైన అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక్కడి నుంచి అమెరికా వంటి దేశాలకు వెళ్లినవారు మళ్లీ వచ్చి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. దేశంలోని అనేక ప్రాంతాలనుంచి టాలెంట్ ఉన్నవారు ఇక్కడికొచ్చి ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. ‘ప్రపంచంలో అత్యధికంగా పుస్తకాలు విక్రయించే అమెజాన్‌కు ఒక్క స్టోర్ కూడా సొంతంగా లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీ అయిన ఉబర్‌కు ఒక్క వాహనం కూడా సొంతంగా లేదు. టెక్నాలజీ ద్వారా వారు కార్యకలాపాలు సాగిస్తున్నారు. కొత్త వ్యాపార అవకాశాలు ఎలా ఉద్భవిస్తున్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
రానున్న రోజుల్లో విద్యుత్తు వాహనాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అందుకే ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటుచేశాం. ఇందులో పరిశ్రమల ఏర్పాటుకు మహీంద్రా, అమరరాజా కంపెనీలు ఇప్పటికే ముందుకొచ్చాయి. ఔషధ రంగంలో జీనోమ్ వ్యాలీలాగే ఆటో రంగంలో మొబిలిటీ వ్యాలీ కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. భారత టాలెంట్‌ను ప్రపంచం గుర్తించింది. అందుకే అనేక బహుళజాతి కంపెనీలు తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నాయి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాక్సిన్లలో ప్రస్తుతం 35 శాతం హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయి. వచ్చే ఏడాది చివరికల్లా ఇది 50 శాతానికి పెరగనున్నది. ప్రస్తుతం తొమ్మిది బిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇక్కడ ఉత్పత్తి అయింది. 2024 చివరి నాటికి 14 బిలియన్ డోసులకు ఉత్పత్తి పెరుగుతుంది. దేశ ఔషధాల ఉత్పత్తిలో 40 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి పొందిన ఔషధ తయారీ పరిశ్రమలు తెలంగాణలో 214 ఉన్నాయి.
– మంత్రి కేటీఆర్
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దృష్టి కేంద్రీకరించి నీటిపారుదల కోసం మూడేండ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంను నిర్మించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది 45 లక్షల ఎకరాలకు సాగునీరే కాకుండా రాష్ర్టానికి తాగునీటిని, పరిశ్రమలకు నీటిని అందిస్తున్నదని చెప్పారు. గ్రీన్, బ్లూ, వైట్, పింక్, ఎల్లో రివల్యూషన్లు తెచ్చామని పేర్కొన్నారు. వ్యవసాయరంగం, మాంసం శుద్ధి, చేపల ఉత్పత్తి, మేకలు, గొర్రెల పెంపకంలో ఎంతో అభివృద్ధి సాధించామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ఇన్లాండ్ ఫిషరీస్‌లో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ ఉన్నదని గుర్తుచేశారు. డెయిరీ రంగాన్ని తక్కువ అంచనా వేయరాదని, న్యూజిలాండ్‌కు చెందిన ఫంటేరా అనే పాల ఉత్పత్తుల కంపెనీ ఆ దేశ జీడీపీలో ఎనిమిది శాతం వాటా కలిగి ఉన్నదని ఉదహరించారు. ఎల్లో రెవల్యూషన్లో భాగంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం పంటను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. దీంతో గ్రామీణ ప్రాంతాలు మరింత అభివృద్ధిబాటన పయనిస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ప్రారంభిస్తున్నామని, వీటిల్లో మెరుగైన ప్రోత్సాహకాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు.
కేటీఆర్ వంటి మంత్రి కేరళలో కూడా ఉంటే బాగుండునని అక్కడి పారిశ్రామికవేత్తలు, ప్రజలు కోరుకొంటున్నారు. నా అనుభవాలను తెలుసుకొని మరింతమంది కేరళ పెట్టుబడిదారులు తెలంగాణకు వస్తున్నారు. ఇంత గ్రేట్ మినిష్టర్ మీకు ఉండటం అదృష్టం. మరింతమంది మలయాళీలకు తెలంగాణలో అవకాశాలు కల్పించాలని మంత్రి కేటీఆర్‌ను కోరుతున్నా.
– జాకబ్, కిటెక్స్ ఎండీ
దేశం అభివృద్ధి సాధించాలంటే కేంద్రం కూడా రాష్ర్టాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ర్టాలకు చేయూతనందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా మంచి నినాదమే అయినా వాస్తవంలో అది కార్యరూపం దాల్చడంలేదని, గతంలో దేశంలో 1,200 ఔషధ పరికరాల తయారీ కంపెనీలుండగా, అందులో 600 మూతపడ్డాయని ఇటీవల బయోఏషియా సదస్సు సందర్భంగా ఏఐఎంఈడీ (అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ)కి చెందిన డాక్టర్ రాజీవ్‌నాథ్ తనతో చెప్పినట్టు గుర్తుచేశారు. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్న తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం సహకరించకపోగా, శిక్షిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు, పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాల్సి ఉండగా, అవేవీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటులో చేసిన చట్టాలను కూడా గౌరవించకపోతే వాటికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు. ఎవరు ఏమి తినాలో, ఏమి కట్టుకోవాలో, ఏమి మాట్లాడాలో నిర్ణయించడానికి మీరెవరని కేంద్రాన్ని నిలదీశారు.
ఆవిష్కరణల లీడర్ తెలంగాణ
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): టీ-హబ్ ఏర్పాటుతో తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరణల్లో నాయకత్వ స్థానానికి ఎదిగిందని సీఐఐ సదరన్ రీజియన్ చైర్పర్సన్ సుచిత్ర ఎల్ల్లా కొనియాడారు. నూతన ఆవిష్కరణలకు అవసరమైన సౌకర్యాలు ఉన్న దేశంలో మొదటి కేంద్రం టీ-హబ్ అని ప్రశంసించారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సీఐఐ వార్షిక సమావేశంలో సుచిత్ర మాట్లాడుతూ.. సంస్థ ఎదుగుదల, విజయానికి పోటీతత్వం ఎంతో దోహదపడుతుందని అన్నారు. సీఐఐ పోటీతత్వాన్ని అందిపుచ్చుకుంటూ పరిశ్రమల వృద్ధికి కృషిచేస్తున్నదని చెప్పారు.
పారిశ్రామికాభివృద్ధికి సుస్థిరత ప్రధానమని, ఇందుకోసం పరిశ్రమ, ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం సీఐఐ నిరంతరం కృషిచేస్తున్నదని వివరించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా సీఐఐకి అనుబంధంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ)ను ప్రారంభించినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా 2025 నాటికి కాలుష్యంలేని పరిశ్రమలు గల దేశంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలోనే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(సీవోడీబీ)పై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. పెట్టుబడులు, నిర్వహణ ఖర్చులు తగ్గించడం ద్వారా పారిశ్రామికరంగానికి మరింత మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పత్తి దేశంలోనే అత్యంత నాణ్యమైనదని సదరన్ ఇండియా మిల్స్ అసోసియేషన్ తెలిపిందని, అందుకే అనేక వస్త్ర పరిశ్రమలు రాష్ర్టానికి వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. 1,250 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటుచేశామని, అందులో గణేశా ఎకోస్పేర్, యంగ్వన్ వంటి కంపెనీలు ఏర్పాటవుతున్నాయని వివరించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ-వర్క్స్‌ను ఇటీవలే ప్రారంభించామని గుర్తుచేశారు. ఫాక్స్‌కాన్ కంపెనీ కొంగరకలాన్‌లో 200 ఎకరాల్లో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నదని, దీంతో ఇతర ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.