Gurukula Schools | హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): గురుకులాలపై ప్రభుత్వ పట్టింపులేనితనం పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నదని, ఓ వైపు విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. కరెంటు షాక్ తగిలి నలుగురు గురుకు ల విద్యార్థులకు గాయాలైన ఘటనపై ఆగ్ర హం వ్యక్తంచేశారు. సిబ్బంది నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపంగా మారుతున్నదని మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ‘మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ గురుకులానికి చెందిన నలుగురు విద్యార్థినులు కరెంట్ షాక్ తగిలి గాయాల పాలవడం దురదృష్టకరం. తక్షణం స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి.. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో పాము కాట్లు, కుక కాట్లు, ఎలుక కాట్లు, ఫుడ్ పాయిజన్ కేసులు సర్వసాధారణమయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో కరెంట్ షాక్‌లు చేరాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి. గాడి తప్పిన గురుకులాలను బాగు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
విద్యార్థులు భుజాలకు బ్యాగులు వేసుకొని ఫుట్‌బోర్డులో ప్రమాదకరంగా వేలాడుతూ బస్సుల్లో ప్రయాణించడంపై హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. బస్సుల సంఖ్య పెంచి బడి పిల్లల ప్రాణాలు కాపాలని టీజీఎస్ఆర్టీసీ సీఎండీ వీసీ సజ్జనార్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థుల ఫుట్‌బోర్డు ప్రయాణం వీడియోలపై సంస్థ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. రోజూ ఉదయం, సాయంత్రం బస్సుల్లో రద్దీ ఎక్కువ ఉంటున్నదని తెలిపారు. రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కొన్ని రూట్లలో విద్యార్థుల రద్దీ విపరీతంగా ఉంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వివరించారు. బస్సులు పెంచే అంశంపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.