హైదరాబాద్, మార్చి 22 (నమసే ్తతెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతారాహిత్యం, అవగాహనలేమితో మాట్లాడే మాటలు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం నర్మెట్ట బహిరంగసభలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్‌లో1972 నుంచి ఉన్న అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్ను అమెరికా సంస్థ అనడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. నల్లమల సరిహద్దులు, కృష్ణా-గోదావరి జలాలు, సుంకేసుల ప్రాజెక్టుల మీదే కాదు.. కండ్ల ముందున్న సంస్థలపై కూడా క్లారిటీ లేదా? అని ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డి గారూ.. పటాన్చెరులో దశాబ్దాలుగా పనిచేస్తున్న ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ఇక్రిశాట్ .. ఏ ఒక దేశానికీ చెందినది కాదు.
ఇది సీజీఐఏఆర్ వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధనా సంస్థ. దీని ఏర్పాటులో అంతర్జాతీయ ఆహార సంస్థ (ఎఫ్ఏవో), యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యూఎన్డీపీ), వరల్డ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించాయి. ప్రారంభ దశలో ఫోర్డ్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ల సహకారంతోపాటు భారత ప్రభుత్వం, పలు దేశాల మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ వేదిక’ అని హరీశ్‌రావు వివరించారు. దాన్ని అమెరికా రీసెర్చ్ సెంటర్ అని సీఎం చెప్పడం దారుణమని దుయ్యబట్టారు. ‘ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో మీరు రాష్ట్రాన్ని నడుపడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చేసే ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా వాస్తవాల ఆధారంగా ఉండాలి. ఇప్పటికైనా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మానుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి’ అంటూ ఎక్స్ ద్వారా హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.