Harish Rao | హైడ్రా రూపంలో సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టించారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. పేదల, మధ్య తరగతి ప్రజల ఇండ్లు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేశాడని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరుతో బీఆర్ఎస్ ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పేదల ఇండ్లు కూల్చిన రాకాసి రాజ్యం ఈ ఇందిరమ్మ రాజ్యమని విమర్శించారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. అనుమతులు ఉన్నాయని చెప్పినా లెక్క చేయకుండా.. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా.. కాళ్లు మొక్కుతున్నా కనికరించకుండా హైడ్రా పేరుతో ఇండ్లను కూల్చివేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. పసిపిల్లలు తమ పుస్తకాలు తెచ్చుకుంటామని వేడుకున్నా వినిపించుకోలేదని అన్నారు. ప్రశ్నించే వాళ్ల మీద నుంచి కూడా బుల్డోజర్ నడుపుతా అని వీధి రౌడీలా బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు అనుమతులుంటే ఇండ్లు కూల్చబోమని కూని రాగాలు తీస్తున్నాడని విమర్శించారు. ఇప్పటికే కూల్చిన ఇండ్లకు నష్టపరిహారం ఎవరిస్తరో మాత్రం చెప్పడం లేదని మండిపడ్డారు. అన్యాయంగా బాధితులు అనుభవించిన క్షోభకు ఎవరు జవాబుదారీ అని నిలదీశారు.
ప్రభుత్వమంటే లంకెబిందెలు తవ్వుకోవడంగా భావించే ముఖ్యమంత్రికి మూసీలో నిజంగానే లంకెబిందెలు కనిపిస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు. ఇది మూసీ ప్రక్షాళన పథకం కానే కాదు, ముమ్మాటికీ ఇది మూటలు వెనకేసుకునే పథకమని విమర్శించారు. నదిని ప్రక్షాళన చేయడమే లక్ష్యమైతే నీళ్లు శుభ్రం చేసే దగ్గర కార్యాచరణ మొదలయ్యేదని.. కానీ, ఇండ్లు కూల్చి భూములను ఆక్రమించుకునే దగ్గర మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. నిజానికి మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ హయాంలోనే ప్రారంభమైందని హరీశ్‌రావు తెలిపారు. 16 వేల కోట్ల బృహత్ ప్రణాళికతో మూసీని జీవనదిగా మార్చేందుకు కేసీఆర్ ఎప్పుడో నడుం బిగించారన్నారు. బీఆర్ఎస్ హయాంలో 21 ఎస్టీపీల నిర్మాణం శరవేగంగా జరిగిందన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను మూసీలో పోసేందుకు నిశ్చయించారని తెలిపారు. నిజాయితీ ఉంటే రేవంత్ సర్కారు, బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాన్ని కొనసాగించేదని అన్నారు.
కేవలం 16 వేల కోట్లతో బీఆర్ఎస్ రూపొందించిన పథకాన్ని పక్కనపెట్టి, 1 లక్షా 50 వేల కోట్లు లూటీ చేసే కొత్త పథకాన్ని సిద్ధం చేశాడని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ పథకాన్ని”మూసీ ప్రక్షాళన పథకం” అనే కన్నా “ప్రజల సొమ్ము భక్షాళన పథకం” అనడం చాలా సబబుగా ఉంటుందని ధ్వజమెత్తారు. మల్లయ్య ఇల్లు కూల్చి మాల్ కడతావా అని నిలదీసినందుకు మా మీద రోత కూతలతో దాడికి దిగాడని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని మూసీలో పడి చస్తావని శాపనార్థాలు పెట్టిన అనాగరికుడు, సంస్కారహీనుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. మూసీ నిర్వాసితులు, హైడ్రా బాధితులు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారని తెలిపారు. ఏడాది పాలన మీద ఏడు దోసిళ్ల మన్నెత్తి పోస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్‌నే తెచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతోనైతే భూములు సేకరిస్తుందో, ఆ ఉద్దేశ్యానికి ఆ భూముల్ని వాడనప్పుడు.. ఆ భూములను వాపస్ చేయాల్సి ఉంటుందని హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, కోదండ రెడ్డి నాడు ఫార్మాసిటీ భూముల వాపస్ ఇస్తమన్నరని.. నేడు అధికారంలోకి రాగానే నిర్బందాల నడుమ 30 వేల ఎకరాల భూములు సేకరిస్తున్నరని విమర్శించారు. ఇది ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఫార్మా సిటీ భూములను తన దోపిడీ ప్రయోజనాలకోసం, రియల్ ఎస్టేట్ దందాకు రేవంత్ రెడ్డి మళ్లిస్తున్నాడని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన 14వేల ఎకరాలు కాదని రేవంత్ రెడ్డి, ఫార్మా కంపెనీలను పల్లెలకు మళ్లిస్తున్నాడని హరీశ్‌రావు తెలిపారు. తొండలు గుడ్లు పెట్టని భూమి అని పొలాలు గుంజుకుంటున్నారని అన్నారు. ఈ దోపిడీ దందాకు వ్యతిరేకంగా న్యాలకల్ రైతులు నిరసిస్తుంటే, లగచర్ల రైతులు తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు. కానీ లగచర్ల గిరిజన బిడ్డల మీద దారుణమైన అణిచివేతను ప్రయోగిస్తూ, ఎమర్జెన్సీ కాలం నాటి పోలీసు రాజ్యాన్ని తెచ్చిండు అని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే రేవంతు..లగచర్ల లంబాడీల దెబ్బకు జడిసి ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నడని అన్నారు. ఫార్మా కంపెనీల కోసం తనకు ఉన్న 500 ఎకరాల భూమి ఇవ్వాలవని సూచించారు.