కుమ్రంభీం ఆసిఫాబాద్,(నమస్తే తెలంగాణ)/కాగజ్‌నగర్, మే 17 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ డివిజన్ ఎల్లూరు అటవీ ప్రాంతంలో ఏడేళ్ల వయసున్న ఆడపులిని వేటగాళ్లు కరెంట్ వైర్లు అమర్చి విద్యుత్తుషాక్‌తో హతమార్చి చర్మం, గోర్లు, వెంట్రుకలు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఘటనా స్థలాన్ని శనివారం కవ్వాల్ వైల్డ్‌లైఫ్ డైరెక్టర్ శాంతారాం, ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్ పరిశీలించారు. కళేబరం నుంచి షాంపిళ్లు సేకరించి ఖననం చేయించారు.
కాగజ్‌నగర్‌లో శాంతారాం, నీరజ్‌కుమార్ వెలువరించిన వివరాల ప్రకారం.. పెంచికల్పేట్ అటవీ ప్రాంతంలో సంచరించే పులి ఈ నెల 13 నుంచి కనబడకుండాపోయింది. 16న ఉదయం ఎల్లూరు అటవీ ప్రాంతంలో వెతుకుతున్న అటవీ అధికారులకు నల్లగుట్ట అటవీప్రాంతంలో పులి కళేబరం కనిపించింది.
దానిని పరిశీలించగా చర్మం, గోర్లు, వెంట్రుకలు (పులిమీసాలు) కనిపించలేదు. వేటగాళ్లు పులిచర్మాన్ని, గోర్లు, వెంట్రుకలను తీసుకెళ్లినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. పులిని హతమార్చిన ఘటనలో ఎల్లూరు, మేడిగూడ, కొత్తగూడ, అగర్‌గూడ, కొమ్ముగూడకు చెందిన 30 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు.