హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకేం సంబంధమని సిట్ అధికారులకు హరీశ్‌రావు సమాధానమిచ్చినట్టు తెలిసింది. హరీశ్‌రావు మంగళవారం తమ ఎదుట విచారణకు రావాలని ప్రత్యేక సిట్ నోటీసులు ఇవ్వడంతో.. ఆయన ఉదయమే తన ఇంటి నుంచి బయలుదేరి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి వెళ్లారు. మళ్లీ సాయంత్రం 6.25 నిమిషాలకు బయటికి వచ్చారు. ఈ సందర్భంగా ముగ్గురు అధికారులు ఆయనను ప్రశ్నించినట్టు తెలిసింది. మిగతా అధికారులంతా వీడియో ద్వారా విచారణను పరిశీలిస్తూ.. ప్రశ్నలు సంధించే వారికి పలు సూచనలు ఇచ్చినట్టు సమాచారం. హరీశ్‌రావును విచారించిన అధికారుల్లో పీ వెంకటగిరి, రవీందర్‌రెడ్డి, సీహెచ్ శ్రీధర్ ఉన్నట్టు తెలిసింది.
నాటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లను ప్రశ్నించారా?
ఫోన్‌ట్యాపింగ్‌లో అవకతవకలు జరిగాయని చెప్తున్న విచారణాధికారులు.. అందుకు కారణమైన నాటి డీజీపీ మహేందర్‌రెడ్డి, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్, నేటి డీజీపీ శివధర్‌రెడ్డిని ప్రశ్నించారా? అని హరీశ్‌రావు అడిగినట్టు తెలిసింది. మళ్లీమళ్లీ ఒకే విధమైన ప్రశ్నలే అడుగుతుండటంతో.. ఇంటెలిజెన్స్ శాఖతో సంబంధమే లేని తనను అడుగుతున్న ప్రశ్నలను నాటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లను కూడా అడగాలని చెప్పినట్టు తెలిసింది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినవారికి వంతపాడుతూ.. విచారణ పేరుతో సమయం వృథా చేయడం మిన హా మరొకటి లేదని హరీశ్‌రావు సూటిగా సమాధానం ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
గంటకొకసారి ఫోన్లతోనే
తనను విచారిస్తున్న క్రమంలో ముగ్గురు అధికారులకు గంటకొకసారి, అర్ధగంటకొకసారి ఫోన్లు వచ్చినట్టు హరీశ్‌రావు మీడియాతో చెప్పారు. ఈ కేసులకు సంబంధించి.. రాజకీయ నాయకులే వారికి పదేపదే ఫోన్లు చేసి ఉంటారని విశ్లేషకులు చెప్తున్నారు. కాగా, సిట్ విచారణ ప్రారంభమైన కొద్ది సేపటికే జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం వద్ద తెలంగాణ పోలీసుశాఖలో కీలకమైన ఓ ఉన్నతాధికారికి చెందిన అనంగులు ఆ పరిసరాల్లోనే తచ్చాడారు. ఆ పరిసరాల్లోకి ఎవరెవరు వచ్చారో మొత్తం ఇన్పుట్స్ తమ అధికారికి అందజేశారు.