హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా అబార్షన్లు, లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. కొంతమంది ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో గర్భిణి మృతి ఘటనపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టగా.. విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి.
ఆదివారం డాక్టర్ గుండగాని శ్రీనివాస్, విష్ణుల నేతృత్వంలోని విచారణ బృందం తుంగతుర్తిలోని ఆర్ఎంపీ శ్రీనివాస్ నిర్వహిస్తున్న సాయి బాలాజీ దవాఖానను తనిఖీ చేశారు. దీంతో దవాఖానను అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అదేవిధంగా కొంతమంది గ్రామీణ వైద్యులతో చేతులు కలిసి అబార్షన్లు, లింగ నిర్ధారణ చేస్తున్నట్టు నిర్ధారించారు. దీంతో దవాఖానను సీజ్ చేయడంతోపాటు శ్రీనివాస్‌పై చట్టపరమైన కేసు నమోదు చేస్తామని ప్రకటించారు. నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నట్టు వెల్లడించారు.