కొడంగల్, సెప్టెంబర్ 04: ఎకరాకు ఇంటిస్థలం సహా రూ.10 లక్షలు ఇస్తామన్నరు.. తీరా రూ.6 లక్షలే ఇచ్చారు. రెండెకరాలుంటే రూ.15 లక్షలే ఇచ్చారు.. అని సీఎం ఇలాకాలోని బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కొడంగల్ పట్టణంలోని కడా (కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ) కార్యాలయంలో అప్పాయిపల్లిలోని సర్వే నం 19కి సంబంధించిన రైతులకు ఎకరానికి రూ.10 లక్షలతోపాటు ఇంటి స్థలం అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్ కూడా పాల్గొన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లింపుల్లో గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కాకుండా అరకొరగా పంపిణీ చేసినట్టు రైతులతోపాటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు విమర్శించారు.
సీఎం ఇలాకాలోనే ఇలా చేయడం అధికారుల నిర్లక్ష్యమా, పాలకుల ద్వంద్వ వైఖరికి నిదర్శనమా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20 నుంచి 25 మంది రైతులకు ఎకరాకు రూ.10 చొప్పున లక్షలు రావాల్సి ఉండగా రూ.6 లక్షలు, రూ.20 లక్షలు రావాల్సిన వారికి రూ.15 లక్షల చొప్పున అందించారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్ అభివృద్ధిని ఆశించి రైతులు సాగు భూమిని ప్రభుత్వానికి అప్పగించామని, తమకు తక్కువ పరిహారం ఎలా ఇస్తారని రైతులు ఎరన్‌పల్లి శ్రీనివాస్, వెంకటయ్య, చంద్రయ్య జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. వారంరోజుల్లో విచారణ చేస్తా మని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు ఫకీరప్ప, మోతీబాయి, పుష్ప మ్మ, పల్లేశ్, రాములుగౌడ్, యశోద, బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు.