ఖమ్మం : టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్న వివాదానికి ఎంపీ అరవింద్ కులం రంగు పులమడం సిగ్గుచేటని రాజ్యసభ సభ్యుడు ఒద్దిరాజు రవిచంద్ర అన్నారు. శనివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ నాయకులతో మాట్లాడినట్లు అరవింద్ అబద్ధపు ప్రచారం చేయడం సహించరాదని అన్నారు. ఆయన కవిత పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ అంతర్గత సమాచారం అరవింద్‌కు తెలియడం వెనుక బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కుమ్మక్కు అర్థమవుతుందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న కేసీఆర్ కుటుంబంపై విమర్శలు స్థాయికి తగినట్టుగా లేవని మండిపడ్డారు. నిజామాబాద్ ఎంపీగా ఒక్క హామీ నెరవేర్చకుండా ఎదుటివారికి నీతులు చెప్పడం తగదని సూచించారు. అరవింద్ వ్యవహరిస్తున్న తీరు కాపుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేలా ఉందని, తన రాజకీయ అవసరాల కోసం కులం ను అడ్డుపెట్టుకోవడం సమంజసంగా లేదని అన్నారు.