హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లను చూస్తుంటే ‘ఫీజులు ఫుల్లు.. చదువు నిల్లు’ అన్న చందంగా తయారయ్యాయి. పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఈ పాఠశాలలు సంపాదనే ధ్యేయంగా అడుగులు వేస్తున్నాయి. చదువులను గాలికొదిలేస్తున్నాయి. ఏటా 20-30శాతం ఫీజలు పెంచుతూ బ్రాండ్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలపై కాస్త శ్రద్ధ పెట్టండి అని అడిగితే చాలు.. యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు తల్లిదండ్రులకే ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఇంట్లో ఇద్దరు ఉంటే చదివించుకోలేరా? అని మాట్లాడటం గమనార్హం.
బడులు ప్రారంభంకానున్న నేపథ్యంలో స్కూల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. రూ.8వేలు ఫీజు కట్టి పుస్తకాలు తీసుకెళ్లండంటూ ఓ పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సందేశం పంపించింది. పుస్తకాలు కొన్న తర్వాత మా బాబు చదువుల్లో కాస్త వీక్‌గా ఉన్నాడు. కొంచెం శ్రద్ధపెట్టండి అంటూ తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌తో చెప్పగా, మీరే ఇంట్లో చదివించుకోవాలి.. పరీక్షలకు మీరే ప్రిపేర్ చేయించాలి.. అంటూ సదరు ప్రిన్సిపాల్ మొహం మీదే చెప్పేశాడు. ఈ స్కూల్లో నాలుగో తరగతి విద్యార్థి ఫీజు అక్షరాలా రూ.1.20 లక్షలు ఉండటం గమనార్హం.
స్కూళ్ల రీ ఓపెన్ నేపథ్యంలో ఓ ప్రముఖ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్‌ను ఓ పేరెంట్ కలిశారు. మేడం గతంలో అకాడమిక్ స్టాండర్డ్స్ బాగుండేవి. మీరు ప్రిన్సిపాల్‌గా వచ్చాక పడిపోయాయి. తల్లిదండ్రులందరిలో ఇదే టాక్ అని ఓపెన్‌గా చెప్పారట. ‘ఇంట్లో ఇద్దరు పిల్లల్నే మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు.. క్లాస్‌లో 40 మంది పిల్లలను మేమెలా కంట్రోల్ చేయగలం’ అంటూ ఆమె బదులిచ్చారట.
ఖైరతాబాద్‌లోని ఓ స్కూల్లో మూడో తరగతి చిన్నారి చదువులో వీక్‌గా ఉన్నది. స్కూల్ మార్పించాలన్న ఆలోచనతో తల్లిదండ్రులు మరో స్కూల్‌ను సంప్రదించారు. విద్యార్థికి పరీక్ష పెట్టిన స్కూల్ యాజమాన్యం అడ్మిషన్ ఇచ్చింది. ఫెయిలైతే మమ్మల్ని అడగొద్దు.. పరీక్షల్లో పాస్ కాకపోతే మళ్లీ మూడో తరగతిలోనే కొనసాగిస్తాం.. ఇందుకు అంగీకరిస్తూ సంతకం చేయండి.. అంటూ తల్లిదండ్రుల నుంచి రాయించుకున్నారట.
మరో స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. ఆరో తరగతిలో 27 మంది విద్యార్థులుంటే 9 మందికి అత్తెసరు మార్కులే వచ్చాయి. తక్కువ మార్కులొచ్చాయని తల్లిదండ్రులు అడిగితే, తల్లిదండ్రులే చదివించుకోవాలంటూ అవతలి వైపు నుంచి సమాధానం వచ్చింది. మేమిద్దం వర్కింగ్ పేరెంట్స్.. మీరే హెల్ప్ చేయాలని తల్లిదండ్రులు అనగా.. అలా అయితే స్కూల్లో ట్యూషన్లు పెడుతున్నాం. నెలకు రూ.3 వేలు కట్టాల్సి ఉంటుంది.. అంటూ ప్రిన్సిపాల్ నుంచి సమాధానం వచ్చింది. ఈ స్కూల్లో ఫీజు రూ.లక్ష ఉండటం గమనార్హం.
రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ స్కూళ్లు గుర్తింపులేకుండానే నడుస్తున్నాయి. 500 స్కూళ్ల వరకు గుర్తింపులేకుండా నడుస్తున్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి స్కూళ్లు గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువగా వెలుస్తున్నాయి. ఇటీవల గుర్తింపు లేని స్కూళ్లపై విద్యాశాఖకు అనేక ఫిర్యాదులు అందాయి. విద్యాశాఖ మాత్రం తూతూమంత్రంగా నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నది. ఎల్బీనగర్ ప్రాం తంలోని ఓ స్కూల్ యాజమాన్యం అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్టు విద్యాశాఖకు ఫిర్యాదులందాయి. అమీర్పేటలోనూ రెండు స్కూళ్లు అనుమతులు లేకుండా నడుస్తున్నట్టు తెలిసింది. ఇటీవల విద్యాశాఖ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కొన్ని స్కూళ్లలో కనీసం అడ్మిషన్ రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా లేదు. అడ్మిషన్ రిజిస్టర్, హాజరు, నామినల్ రోల్స్ వివరాలేవి సరిపోలడం లేదు. కొన్ని బడుల్లో పెన్షిల్ రాతలు రాసి అవసరమైనప్పుడు చెరిపేస్తున్నారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్లు సక్రమంగా లేవు. పలు పాఠశాలల్లో ప్రవేశం, నిష్క్రమణ వివరాలు లేకపోవడంతోపాటు బోగస్ స్టడీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా ఆయా స్కూళ్లపై చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖ చోద్యం చూడటం గమనార్హం.