Samantha | స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మహిళా ప్రధాన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమంత, రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ సమయంలో రాజ్ నిడిమోరు వర్కింగ్ స్టైల్ తనను బాగా ఆకట్టుకుందని సమంత తెలిపారు. తాను అంతకుముందు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ, రచయితలు, టెక్నీషియన్లు, క్రియేటివ్ టీమ్ సభ్యులు అందరూ కలిసి కథపై చర్చించడం, తమ తమ అభిప్రాయాలను పంచుకోవడం మొదటిసారిగా రాజ్ టీమ్‌లోనే చూశానని పేర్కొన్నారు.చాలా సందర్భాల్లో సినిమా నిర్మాణ ప్రక్రియ ఒక వ్యక్తి నిర్ణయాల చుట్టూ తిరుగుతుందని, అయితే రాజ్ మాత్రం టీమ్‌లోని ప్రతి ఒక్కరి అభిప్రాయానికి విలువ ఇస్తారని సమంత చెప్పారు. అనేక మంది ప్రతిభావంతులు కలిసి చర్చిస్తే మరింత మెరుగైన ఫలితం వస్తుందనే నమ్మకం రాజ్‌కు ఉందని ఆమె వెల్లడించారు.
అయితే సమంత వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్లో పలువురు ప్రముఖ దర్శకులు కూడా తమ రచయితల బృందం, నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి కథా చర్చలు నిర్వహిస్తారని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ముఖ్యంగా స్క్రిప్ట్ డెవలప్మెంట్ విషయంలో టీమ్ వర్క్‌కు ప్రాధాన్యత ఇచ్చే దర్శకులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. దీంతో సమంత వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాలు, సోషల్ మీడియా వేదికలపై హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఆమె ఉద్దేశం రాజ్ నిడిమోరు పని విధానాన్ని ప్రశంసించడమేనని, దానిని ఇతర దర్శకులతో పోల్చి చూడాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.