హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మైనార్టీల సంక్షేమంలో సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ మైనార్టీ నేత సయ్యద్ అక్బర్ హుస్సేన్ దుయ్యబట్టారు. సోమవారం తెలంగాణభవన్‌లో మైనార్టీ నేత వహీద్ అహ్మద్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మైనార్టీ మంత్రి లేడని, రంజాన్ మాసం ప్రారంభం కావస్తున్నా.. ఇంతవరకు సీఎం సమీక్ష నిర్వహించకపోవడం దారుణమని విమర్శించారు. కేసీఆర్ హయాంలో మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపితే, కాంగ్రెస్ పాలనలో చీకట్లు కమ్ముకున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యేవని, ఇప్పుడు షాదీ ముబారక్ చెక్కులు కూడా అందడం లేదని పేర్కొన్నారు.
రంజాన్‌కు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, శాంతిభద్రతల పరిరక్షణలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వహీద్ అహ్మద్ మాట్లాడుతూ.. సుమారు 15 నెలల కాంగ్రెస్ పాలనలో మైనార్టీల సంక్షేమానికి ఒక్క కార్యక్రమం చేపట్టలేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు రేవంత్‌రెడ్డి శాయశక్తులా కృషి చేస్తున్నాడని ఆరోపించారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలపై సీఎం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరించాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు.