హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాల విస్తరణతోపాటు బంగాళాఖాతంలో బలపడిన ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షం ముసురుకున్నది. మహబూబాబాద్, కామారెడ్డి, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జూలైలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదుకానున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై సగటు వర్షపాతం 227.2 మి.మీటర్లకుగాను బుధవారం వరకు 33.8 మి.మీటర్ల నమోదైనట్టు వెల్లడించింది.