Rains | ‘ముసురు’కున్న వాన.. మరో 3 రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు విడువకుండా కురుస్తున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది.
- 24 జిల్లాలకు యెల్లో అలర్ట్
- వేంపల్లెలో18 సెం.మీ వాన
- రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వాన
- పొంగుతున్న వాగులు, చెరువులు
- తెగిన రోడ్లు.. నిలిచిన రాకపోకలు
- గోదావరి, ప్రాణహితల్లో వరద ఉధృతి
- వర్షాలకు ఇద్దరి మృతి.. ఒకరి గల్లంతు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు తోడు ఎగువనుంచి వస్తున్న వరద కారణంగా వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భూపాలపల్లి-పెద్దపల్లి, ములుగు- ఛత్తీస్‌గఢ్ సహా పలుమార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వరదనీటి తీవ్రతకు కొన్నిచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. మరోవైపు కడెం వాగు నుంచి నీటిని వదలడంతో గోదావరి వరద ప్రవాహ ఉధృతి మరింత పెరిగింది. ప్రాణహితలోనూ వరద పోటెత్తుతున్నది. ఎడతెగని వాన కారణంగా సింగరేణిలోని 20 ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
Rains | న్యూస్‌నెట్‌వర్క్, జూలై 21 (నమస్తేతెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు విడువకుండా కురుస్తున్నాయి. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు భారీగా వరద నీరు చేరడంతో మత్తళ్లు పోస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో వరద ధాటికి అంతర్గత రోడ్లు తెగిపోయి ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల్లో వర్షాలకు ఇండ్లు తడిసి కూలిపోయాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచికొడుతున్నది. మూడు రోజుల క్రితం మొదలై వదలకుండా కుండపోత పోస్తున్నది. కోనరావుపేట మండలం మామిడిపల్లిలో పాముగారి రమేశ్ పెంకుటిల్లు కూలిపోయింది. మల్లాపూర్ మండల కేంద్రంలో దామెర నరేశ్ ఇల్లు కూలిపోగా తహసీల్దార్ వీర్‌సింగ్ పరిశీలించారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయినిపేట(తెనుగుగూడెం)లో కుంట సమ్మక్క, సందీప ఇల్లు కూలిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముసురు వాన వీడటం లేదు. కుండపోత వానలతో ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటెత్తుతున్నది.
ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామ పంచాయతీ పరిధిలోని బారెగూడలో రోడ్డు బురదమయం కాగా.. గ్రామస్థులు వరి నాటు వేసి నిరసన తెలిపారు. చింతలమానేపల్లి మండలంలోని దిందా-కేతిని వాగు ఉప్పొంగడంతో దిందా ప్రజలు మూడు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నారు. కొండపల్లి గ్రామంలో గొల్లవాగుపై శిథిలావస్థలో ఉన్న లో లేవల్ వంతెనలో కోడె పడి మృతి చెందింది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతుండటంతో సింగరేణిలోని 20 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి, ప్రైవేట్ కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిన మట్టి తవ్వకాలు, రవాణా పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీరాంపూర్ ఏరియాలో 5 రోజుల్లో రూ.4.5 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. లో లెవల్ కల్వర్టులపై నుంచి వరదనీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
గర్మిళ్లపల్లి, ఓడేడుతోపాటు బూర్నపల్లి, కిష్టంపేట మధ్య మానేరు వరద ఉధృతికి తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లి సమీపంలో మోరంచ వాగు ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నదని, వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఓసీ-2, 3 గనుల్లోకి భారీగా వరదనీరు, మట్టి చేరడంతో ఉపరితల గనులు బురదయమై బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. తాడిచర్ల జెన్కో ఆధ్వర్యంలో చేపడుతున్న ఏ ఎమ్మార్ కంపెనీలో బొగ్గు ఉత్పత్తికి ఆంతరాయం ఏర్పడింది. వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు. డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. వరంగల్ దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువు నిండటంతో లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ సత్యశారద, అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. పశువులను మేపడానికి పొలాల్లోకి వెళ్లి వర్షానికి తడిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామానికి చెందిన పంతంగి లస్మయ్య(55) మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జనగామ జిల్లా వడ్లకొండలో పాతగోడ కూలి గుండె రమ (38) మృతి చెందింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువులు, వాగులు అలుగులు పోస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్, ధర్మోరా మొండివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గాండ్లపేట్ శివారులో వరదకాలువ పక్కన పంటలు నీటమునిగాయి. నవీపేట మండలంలోని ఫత్తేనగర్, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బోనాల్ తండా, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డులో ఇండ్లు కూలిపోయాయి. ఉమ్మడి మెదక్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ముసురు కురుస్తున్నది. పినపాక మండలంలో చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి ప్రజలు బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

